Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించగానే కుప్పకూలిన టెస్లా షేర్లు.. ఒక్క రోజే రూ.7లక్షల కోట్ల నష్టం
ఒక్క రోజే రూ.7లక్షల కోట్ల నష్టం

Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశాడు. తాను ఒక కొత్త అమెరికన్ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన ప్రభావం అమెరికా షేర్ మార్కెట్‌పై సోమవారం స్పష్టంగా కనిపించింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే, ఎలన్ మస్క్ ప్రధాన కంపెనీ అయిన టెస్లా షేర్లు దాదాపు 8 శాతం పడిపోయాయి. దీని వల్ల కంపెనీ విలువకు సుమారు 82 బిలియన్ డాలర్లు (రూ.7 లక్షల కోట్ల)పైగా నష్టం వాటిల్లింది. ఎలన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పెరుగుతున్న విభేదాలు, ఘర్షణల కారణంగానే మస్క్ ఈ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా షేర్ మార్కెట్ నాస్‌డాక్ కంపోజిట్ , డావ్ జోన్స్, S&P 500 వంటి అన్ని ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
టెస్లా షేర్లు క్రాష్
సోమవారం అమెరికా షేర్ మార్కెట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ కంపెనీలలో ఒకటిగా ఉన్న టెస్లా షేర్లు కుప్పకూలాయి. ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాతే ఈ భారీ పతనం కనిపించింది. అమెరికన్ షేర్ మార్కెట్ డేటా ప్రకారం, టెస్లా షేర్ సుమారు 8 శాతం నష్టంతో 291.64డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా, ట్రేడింగ్ సెషన్‌లో ఒక దశలో షేరు 288.77డాలర్లకు పడిపోయి, రోజులో కనిష్ట స్థాయిని చేరుకుంది. షేరు 291.37డాలర్ల వద్ద ప్రారంభమైంది. అంతకు ముందు శుక్రవారం, షేరు 315.35డాలర్ల వద్ద ముగిసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా షేర్ల విషయంలో పెట్టుబడిదారులలో చాలా అస్థిరత కనిపిస్తోంది. దీని ప్రభావం కంపెనీ షేర్ల ధరలపై స్పష్టంగా తెలుస్తోంది.
టెస్లా విలువకు భారీ దెబ్బ
షేర్ మార్కెట్‌లో టెస్లా షేర్ల పతనం కారణంగా కంపెనీ మొత్తం మార్కెట్ విలువపై కూడా తీవ్ర ప్రభావం పడింది. అమెరికా షేర్ మార్కెట్ డేటా ప్రకారం, కంపెనీ విలువ ఒక్కసారిగా 82 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఈ మొత్తం ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మొత్తం నికర విలువకు దాదాపు సమానం. శుక్రవారం అమెరికా షేర్ మార్కెట్ ముగిసే సమయానికి టెస్లా కంపెనీ విలువ 994.32 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, సోమవారం షేరు కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత, కంపెనీ విలువ 912.68 బిలియన్ డాలర్లుకు తగ్గింది. అంటే, కంపెనీ విలువలో 81.64 బిలియన్ డాలర్ల భారీ నష్టం వాటిల్లింది.
ఈ ఏడాది టెస్లా షేర్ల పతనం
ఈ సంవత్సరం ఇప్పటివరకు టెస్లా షేర్ల పరిస్థితి చూస్తే, వాటి విలువ 23 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. గణాంకాలను పరిశీలిస్తే, జనవరి 2న కంపెనీ షేర్ ధర 379.28డాలర్లుగా ఉంది. అప్పటి నుండి ఇప్పటివరకు 90డాలర్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. గత ఆరు నెలల్లో, కంపెనీ షేరులో 26 శాతం పతనం కనిపించింది. ఒక నెలలో 5 శాతం కంటే ఎక్కువ, ఒక వారంలో 8 శాతం కంటే ఎక్కువ నష్టం నమోదైంది.
