Elon Musk : ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలన్ మస్క్ క్రెడిట్ హిస్టరీలో ఒక ఊహించని మార్పు చోటుచేసుకుంది. ప్రపంచ మార్కెట్లలో టెక్ షేర్ల మందగమనం, స్పేస్‌ఎక్స్ వ్యాల్యుయేషన్‌లో వచ్చిన భారీ మార్పుల కారణంగా మస్క్ తన ప్రతిష్టాత్మక ట్రిలియనేర్ హోదాను కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఆయన మొత్తం నికర ఆస్తి విలువ 957 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి కరిగిపోయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన మొదటి స్థానానికేం ఢోకా లేదు.

మూడు రోజుల్లోనే రూ. 11.14 లక్షల కోట్ల నష్టం

ఇటీవలే షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో మస్క్ యాజమాన్యంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ సంచలన రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ అద్భుతమైన వృద్ధి కారణంగానే మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనేర్‌గా అవతరించారు. అయితే గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు మారడంతో ఒక్కసారిగా స్పేస్‌ఎక్స్ షేర్లు 150 డాలర్ల స్థాయి కంటే కిందకు పడిపోయాయి. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 600 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది. దీనివల్ల ఎలన్ మస్క్ వ్యక్తిగతంగా 118 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.14 లక్షల కోట్లు) నష్టపోవాల్సి వచ్చింది.

బ్లూమ్‌బెర్గ్ వర్సెస్ ఫోర్బ్స్ రేటింగ్స్

ఎలన్ మస్క్ ఆస్తి లెక్కలపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలైన బ్లూమ్‌బెర్గ్, ఫోర్బ్స్ మధ్య చిన్నపాటి వ్యత్యాసం కనిపిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ఆయన ఆస్తి 957 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ట్రిలియనేర్ లిస్ట్ నుంచి తొలగించగా, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా మాత్రం భిన్నంగా ఉంది. ఫోర్బ్స్ ప్రకారం మస్క్ ఆస్తి ఇప్పటికీ 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే ఏకైక ట్రిలియనేర్‌గా ఆయనే కొనసాగుతున్నారు. ఎలన్ మస్క్ సంపదలో సింహభాగం స్పేస్‌ఎక్స్ నుండే వస్తుంది. ఈ కంపెనీలో ఆయనకు 38 శాతం వాటా ఉండగా, దాని విలువ సుమారు 744 బిలియన్ డాలర్లు. దీనితో పాటు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఆయనకున్న షేర్ల విలువ 158 బిలియన్ డాలర్లుగా ఉంది.

టెస్లా కార్ల యాక్సిడెంట్, ఐటీ ఖర్చులు

మస్క్ సంపద ఇంత వేగంగా పడిపోవడానికి కేవలం స్పేస్‌ఎక్స్ మాత్రమే కారణం కాదు, టెస్లా కంపెనీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా ఒక కారణమే. టెస్లా మోడల్ 3 కారు అమెరికాలో ఒక ఘోర ప్రమాదానికి గురవడంతో, ఆ కారులోని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (AI సాఫ్ట్‌వేర్) పై అమెరికన్ రెగ్యులేటరీ సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ నెగెటివ్ వార్తతో టెస్లా షేర్లు ఈ వారంలోనే 5 శాతం వరకు కుప్పకూలాయి. మరోవైపు, స్పేస్‌ఎక్స్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పేస్ డేటా సెంటర్ల కోసం భారీగా నిధులను ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఖర్చుల కోసం బాండ్ల ద్వారా అప్పులు సేకరించడానికి కంపెనీ సిద్ధమవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలై, షేర్ల అమ్మకాలకు దారితీసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story