Energy Security : ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా పడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి దాదాపు మూతబడే పరిస్థితి రావడంతో.. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ తీవ్ర సంక్షోభం నుంచి గుణపాఠం నేర్చుకున్న భారత ప్రభుత్వం.. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు ఎదురైతే దేశం స్తంభించిపోకుండా ఉండటం కోసం ఒక భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దేశీయంగా నెల రోజుల పాటు ఇంధన అవసరాలను తీర్చేలా ముడి చమురు, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ నిల్వలను పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీని కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న నిల్వలు ఎంత?

ప్రస్తుతానికి భారతదేశం వద్ద దాదాపు 39 మిలియన్ బారెళ్ల వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది దేశానికి కేవలం 8 రోజుల ముడి చమురు దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతుంది. మన పొరుగు దేశమైన చైనాతో పోలిస్తే ఈ నిల్వలు చాలా తక్కువ. అయితే, దేశంలోని వివిధ రిఫైనరీలు, ఫ్యూయల్ రీటైలర్ల వద్ద ఉన్న స్టాక్‌ను కూడా కలిపితే దాదాపు 70 రోజుల డిమాండ్‌ను తట్టుకోగలం. ప్రస్తుతం ఉన్న నిల్వలను మరింత పెంచడానికి దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో భూమి కింద పెద్ద పెద్ద గుహల ద్వారా స్ట్రాటజిక్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని ఏకంగా 120 మిలియన్ బారెళ్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గ్యాస్, ఎల్పీజీ నిల్వల నిర్వహణలో సవాళ్లు

ముడి చమురు నిల్వలను పెంచడం కొంత సులభమే అయినప్పటికీ.. ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ నిల్వలను దాచడం భారతదేశానికి చాలా పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఎల్పీజీని అధిక పీడనంతో లిక్విడ్ రూపంలో దాచాల్సి ఉంటుంది. అలాగే ఎల్‌ఎన్‌జీని చాలా తక్కువ మైనస్ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచాలి. వీటికి లీకేజీలు లేదా పేలుళ్లు జరగకుండా కఠినమైన భద్రతా ప్రమాణాలు అవసరం. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన థింక్ ట్యాంక్ తక్షశిల ఇన్స్టిట్యూషన్ ప్రకారం.. భారత్ లాంగ్ టర్మ్ ఎల్పీజీ స్టోరేజ్ కెపాసిటీ కేవలం 1.4 లక్షల టన్నులు మాత్రమే ఉంది, ఇది కేవలం రెండు రోజుల వినియోగానికి సరిపోతుంది. అందుకే అత్యవసర పరిస్థితుల కోసం ఎల్పీజీ నిల్వలను వెంటనే పెంచాలని ప్రభుత్వ రంగ రిఫైనరీలను చమురు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

గ్యాస్ విషయానికి వస్తే దేశంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యూహాత్మక నిల్వలు లేవు. దీనికోసం ప్రభుత్వం గత ఏడాది ఒక ముసాయిదా విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం గ్యాస్ టెర్మినల్ ఆపరేటర్లు తమ సాధారణ అవసరాల కంటే 10 శాతం అదనంగా నిల్వలను ఉంచుకోవాలి, అత్యవసర సమయంలో ప్రభుత్వం ఆ నిల్వలను వాడుకుంటుంది. దీనికి తగ్గట్టే పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ వంటి కంపెనీలు కొత్తగా భారీ స్టోరేజ్ ట్యాంకులను నిర్మిస్తున్నాయి.

ఇంధన సంక్షోభం వేళ జపాన్‌తో భారత్ దోస్తీ

ఇరాన్ సంక్షోభం తీవ్రస్థాయికి చేరినప్పుడు భారతదేశంలో డీజిల్, ఎల్పీజీ, గ్యాస్ వినియోగంపై రేషనింగ్ విధించాల్సి వచ్చింది. ఆ సమయంలో కొరతను అధిగమించడానికి భారత్.. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల సహాయం కోరింది. ఎందుకంటే ఈ దేశాల వద్ద ఇప్పటికే భారీగా ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ నిల్వలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి సింగపూర్, తైవాన్ దేశాల తరహాలోనే భారత్ కూడా తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా జపాన్, భారతదేశం కలిసి ఎల్‌ఎన్‌జీ నిల్వలపై పరస్పర సహకార ఒప్పందం చేసుకోబోతున్నాయి. ఈ వారంలో న్యూఢిల్లీలో జరగబోయే ద్వైపాక్షిక చర్చల్లో జపాన్ ప్రధాని సనాయే తకైచి, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story