EPF: ఉద్యోగం మానేసే వరకు ఆగాల్సిన పనిలేదు.. ప్రతి పదేళ్లకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు
ప్రతి పదేళ్లకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు

EPF: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా నుంచి డబ్బులు మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలంటే సాధారణంగా ఉద్యోగ విరమణ చేసే వరకు వేచి ఉండాలి. లేదా ఉద్యోగం కోల్పోయి మూడు నెలలు నిరుద్యోగిగా ఉండాలి. అయితే, ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి, కొత్త రూల్స్ తీసుకురావాలని చూస్తోంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పీఎఫ్ డబ్బును పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం కల్పించనుంది. ఒకవేళ 10 సంవత్సరాలకు పూర్తి బ్యాలెన్స్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతించే నిర్ణయం తీసుకోకపోయినా, కనీసం 60శాతం వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు 7.4 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వారి పీఎఫ్ ఖాతాలలో మొత్తం రూ.25 లక్షల కోట్లు నిధులు ఉన్నాయి. పీఎఫ్ డబ్బును వెనక్కి తీసుకోవడానికి ఇప్పుడు కూడా 10ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి నిర్మాణం, వైద్య అత్యవసర పరిస్థితులు, విద్య, వివాహం వంటి కారణాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ డబ్బును వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంది.
ప్లాట్ కొనుగోలు చేయడానికి లేదా ఇంటి నిర్మాణం కోసం 90శాతం వరకు పీఎఫ్ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. గతంలో ఐదు సంవత్సరాలు పీఎఫ్ ఖాతా నుండి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ నిబంధనను ఇప్పుడు మూడు సంవత్సరాలకు తగ్గించారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరాన్ని తీర్చడానికి ఈ అవకాశం ఇవ్వబడుతోంది.
కొత్తగా రాబోయే 10ఏళ్లు విత్‌డ్రా నిబంధన ప్రకారం డబ్బును వెనక్కి తీసుకోవడానికి ఎటువంటి కారణం చెప్పాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ సభ్యులు తమ డబ్బును వేరే చోట కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ లో సంవత్సరానికి 8.25% వడ్డీ లభిస్తుంది. దీనికి బదులుగా, ప్రజలు సంవత్సరానికి 10-16% లాభం ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో లేదా షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ కారణం వల్లే ప్రభుత్వం 10ఏళ్ల నిబంధనను రూపొందించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు.
