EPF Scheme 2026 : ఆరు దశాబ్దాల పాత చట్టానికి స్వస్తి.. అమలులోకి వచ్చిన సరికొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026
సరికొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026

EPF Scheme 2026 : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్థుల ప్రయోజనాల కోసం ఉద్యోగుల భవిష్య నిధి (EPF) నిబంధనలలో చారిత్రాత్మక మార్పులు చేసింది. దాదాపు ఆరు దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో ఇప్పుడు సరికొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 పరిధిలో రూపొందించిన ఈ కొత్త విధానం ద్వారా పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు తీసుకోవడం మునుపటి కంటే చాలా సులభతరంగా మారింది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చేరి ఏడాది కూడా పూర్తి కాకుండానే వివిధ కారణాల వల్ల జాబ్ మానేసే వారికి ఈ స్కీమ్ ద్వారా పెద్ద ఊరట లభించింది. అయితే, ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఇందులో 25 శాతం మినిమం బ్యాలెన్స్ అనే కొత్త నిబంధనను కూడా చేర్చింది.
పీఎఫ్ ఖాతాదారులకు షాక్
కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతాదారులందరూ తమ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. మీ పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం సొమ్ములో (ఉద్యోగి వాటా, సంస్థ వాటా, వడ్డీ కలిపి) 25 శాతం భాగాన్ని ఎల్లప్పుడూ లాక్ చేసి ఉంచుతారు. దీనిని కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విత్‌డ్రా చేయడానికి వీలుండదు. ఈ 25 శాతం నిధిని మినహాయించగా మిగిలిన 75 శాతం సొమ్మును ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ గా పరిగణిస్తారు. చందాదారులు తమ అవసరాల నిమిత్తం కేవలం ఈ 75 శాతం నిధుల నుంచి మాత్రమే డబ్బులు డ్రా చేసుకోవడానికి అర్హులు. భవిష్యత్తులో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి చేతిలో కొంతైనా ఫండ్ మిగలాలనే మంచి ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిబంధన పెట్టింది.
ఇల్లు, పెళ్లి, చదువుల కోసం ఈపీఎఫ్ నిధులు
మీరు ఈపీఎఫ్ఓ లో సభ్యునిగా 12 నెలలు పూర్తి చేసుకున్నట్లయితే, మీ వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాల కోసం ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ నుంచి 100 శాతం వరకు నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం కింది అవసరాలకు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది:
* కుటుంబ సభ్యులకు లేదా తనకు అత్యవసర వైద్య ఖర్చులు నిమిత్తం.
* పిల్లల ఉన్నత చదువుల ఖర్చుల కోసం.
* స్వంత వివాహం లేదా కుటుంబంలో ఎవరిదైనా పెళ్లి వేడుకల కోసం.
* కొత్త ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు చేయడం లేదా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనడం.
* హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించడం లేదా పాత ఇంటిని రిపేర్ చేయించడం.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాలో కనీస నిల్వ షరతు నెరవేరిన తర్వాత పీఎఫ్ కమిషనర్ దీనికి అనుమతి ఇస్తారు.
ఏడాది పూర్తి కాకుండానే జాబ్ వదిలేసిన వారికి ఊరట
చాలామంది ఉద్యోగులు కొత్త కంపెనీలలో చేరిన కొన్ని నెలలకే వ్యక్తిగత కారణాల వల్ల లేదా మంచి అవకాశం రావడం వల్ల ఉద్యోగాలు మారుతుంటారు. పాత నిబంధనల ప్రకారం ఏడాది కంటే తక్కువ సర్వీస్ ఉన్నవారికి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఈపీఎఫ్ స్కీమ్ 2026 ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి 12 నెలల సర్వీస్ పూర్తి కాకుండానే ఉద్యోగం మానేసినా కూడా పార్షియల్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, సదరు ఉద్యోగి తాను ఉద్యోగం వదిలేసిన రోజు వరకు తన ఖాతాలో ఉన్న ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ (75 శాతం వాటా) పరిమితికి లోబడి మాత్రమే సొమ్మును వెనక్కి తీసుకోగలడు. తక్కువ కాలం ఉద్యోగాలు చేసేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
ఏ అవసరానికి ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవాలో చూద్దాం.. విత్‌డ్రాలపై పరిమితులు ఇవే!
పీఎఫ్ ఖాతాను జీవితకాల పొదుపుగా భావిస్తారు కాబట్టి, ఉద్యోగులు పదే పదే డబ్బులు తీసి ఖాతాను ఖాళీ చేయకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని గరిష్ట పరిమితులను విధించింది.
* పిల్లల చదువుల కోసం: ఒక ఉద్యోగి తన మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 10 సార్లు మాత్రమే పిల్లల విద్య కోసం పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
* పెళ్లి ఖర్చుల కోసం: వివాహ అవసరాల కోసం పీఎఫ్ మెంబర్‌షిప్ ఉన్న కాలంలో గరిష్టంగా 5 సార్లు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది.
* ఇల్లు లేదా స్థలం కోసం: సొంత ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి లైఫ్ టైమ్‌లో గరిష్టంగా 5 సార్లు మాత్రమే పార్షియల్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
* ప్రత్యేక అత్యవసర పరిస్థితులు: ఏదైనా అసాధారణ అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) వస్తే, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

