EPFO: ప్రైవేట్ ఉద్యోగులు, వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఊరటనిచ్చింది. ఉద్యోగ భవిష్య నిధి సంఘం పరిధిలోని వేతన పరిమితిని రూ.15,000 నుంచి ఏకంగా రూ.25,000కు పెంచిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత కంపెనీలు తమ ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీలో ఎలాంటి కోత పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పీఎఫ్ పరిధి పెరిగిన ప్రయోజనం పూర్తిగా ఉద్యోగులకే దక్కాలని, వారి నెలవారీ బడ్జెట్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు

పెరిగిన వేతన పరిమితిని సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగుల బేసిక్ శాలరీ తగ్గించడానికి వీల్లేదని కార్మిక మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. కొత్త వేతన పరిమితి కారణంగా కంపెనీలపై పడే అదనపు భారాన్ని ఉద్యోగుల కాస్ట్-టు-కంపెనీ సర్దుబాటు పేరుతో వారి చేతికి వచ్చే జీతంలో కోత పెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది. సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఈ వేతన పరిమితిని పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు ఒక కోటికి పైగా అదనపు ఉద్యోగులను ఈపీఎఫ్‌ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సామాజిక భద్రతా ప్రయోజనాలను కంపెనీలు మరింత మెరుగైన మానవ వనరుల విధానంగా చూడాలని సూచించాయి.

ఈపీఎస్, పీఎఫ్ కంట్రిబ్యూషన్ విధివిధానాలు

రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య జీతం పొందే ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కిందకు రావడం ఇకపై తప్పనిసరి చేశారు. ఉద్యోగి తరఫున చెల్లించే 12 శాతం చందా మొత్తం ఈపీఎఫ్‌కే వెళుతుంది. అదేవిధంగా యజమాని చెల్లించే 12 శాతం చందా రెండు భాగాలుగా విభజించబడుతుంది. ఇందులో 8.33 శాతం ఈపీఎస్ (పెన్షన్) ఖాతాకు, మిగిలిన భాగం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అర్హులైన ఉద్యోగుల వివరాలను తక్షణమే సమీక్షించి, రాబోయే పేరోల్ సైకిల్ కోసం వేచి చూడకుండా వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీలను ఆదేశించారు.

పీఎంవీబీఆర్ వై కింద ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ఈ కొత్త నిబంధనల వల్ల కంపెనీలపై కొంత అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే PMVBRY కింద ప్రతి కొత్త ఉద్యోగానికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఆ భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని కంపెనీలకు సూచించింది. దేశంలో వర్క్‌ఫోర్స్‌ను మరింత ఫార్మలైజ్ చేయడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

Next Story