EPFO : ఇక ఏటీఎం, యూపీఐ ద్వారా డబ్బులు విత్ డ్రా.. ఈ నెల నుంచే ఈపీఎఫ్‌ఓ 3.0 షురూ!
ఈ నెల నుంచే ఈపీఎఫ్‌ఓ 3.0 షురూ!

EPFO : కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ తీపి కబురు అందించింది. ఇకపై పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మే చివరి నాటికల్లా ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. సుమారు 7.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఈ కొత్త సౌకర్యం ద్వారా తక్కువ పేపర్ వర్క్ తోనే తమ సొంత డబ్బును వాడుకోవచ్చు. ప్రస్తుత పీఎఫ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ మార్చడమే ఈ ఈపీఎఫ్‌ఓ 3.0 లక్ష్యం. దీనివల్ల గతంలో 10 నుంచి 20 రోజులు పట్టే క్లెయిమ్ ప్రక్రియ, ఇకపై కేవలం 2 నుంచి 5 రోజుల్లోనే పూర్తవుతుంది. ముఖ్యంగా రూ.5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్‌లు ఆటోమేటిక్ పద్ధతిలో సెటిల్ చేయబడతాయి. ఆధార్ వెరిఫై అయిన ఖాతాదారులకు ఇకపై బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్ ఫోటోలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
ఏటీఎం, యూపీఐ ద్వారా డబ్బు ఎలా వస్తుంది?
ఈ కొత్త విధానంలో ఈపీఎఫ్‌ఓ తన సభ్యులకు ఒక ప్రత్యేకమైన ఏటీఎం కార్డును ఇస్తుంది. ఇది నేరుగా వారి పీఎఫ్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. ఈ కార్డుతో నేరుగా ఏటీఎం మెషీన్ల నుండి నగదు తీసుకోవచ్చు. అలాగే ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా కూడా పీఎఫ్ డబ్బును నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. ప్రారంభంలో రూ.లక్ష వరకు ఇలా తీసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగం మారినా టెన్షన్ లేదు
కొత్త సిస్టమ్ వల్ల ఉద్యోగం మారే వారికి పెద్ద ఉపశమనం లభించనుంది. పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పీఎఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఆటోమేటిక్ గా బదిలీ అవుతుంది. దీని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. అయితే ఈ సౌకర్యాలు పొందాలంటే మీ యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు పక్కాగా లింక్ అయి ఉండాలి.
నిబంధనలు, పన్ను జాగ్రత్తలు
ఒకవేళ ఉద్యోగం కోల్పోతే, నెల రోజుల తర్వాత 75 శాతం పీఎఫ్ సొమ్మును, రెండు నెలల తర్వాత మిగిలిన 25 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. పన్ను విషయానికి వస్తే.. మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో కలిపి మొత్తం 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటే, పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు. అయితే, పీఎఫ్ అనేది రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు కాబట్టి, అత్యవసరమైతే తప్ప డబ్బు తీయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

