EPFO : మీ పీఎఫ్ అకౌంట్ హఠాత్తుగా లాక్ అయిందా? ఇంట్లోనే కూర్చుని ఇలా అన్‌లాక్ చేసుకోండి
ఇంట్లోనే కూర్చుని ఇలా అన్‌లాక్ చేసుకోండి

EPFO : దేశంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేది ఒక పెద్ద ఆర్థిక భరోసా. అయితే, ఈ మధ్య కాలంలో చాలామంది పీఎఫ్ ఖాతాదారులు ఒక వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికో, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికో లేదా కేవైసీ అప్‌డేట్ చేయడానికో ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవుతుంటే.. అకౌంట్ లాక్ చేయబడింది లేదా బ్లాక్ అయింది అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇలా జరగగానే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ శాశ్వతంగా బంద్ కాలేదు, అందులో ఉన్న మీ కష్టార్జితం కూడా వంద శాతం సురక్షితంగానే ఉంటుంది. సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతో ఈపీఎఫ్ఓ సెక్యూరిటీ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసింది, అందువల్లే చిన్న అనుమానం వచ్చినా ఆటోమేటిక్‌గా ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేస్తోంది.
పదే పదే తప్పు పాస్‌వర్డ్ కొడితే అంతే సంగతులు
చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా లాక్ అవ్వడానికి ముఖ్య కారణం.. లాగిన్ అయ్యేటప్పుడు తప్పుడు వివరాలను ఎంటర్ చేయడం. చాలా కాలం పాటు పోర్టల్‌ను ఓపెన్ చేయకపోవడం వల్ల పాత పాస్‌వర్డ్ మర్చిపోతుంటారు. లేదా పాత ఉద్యోగాలకు సంబంధించిన వేర్వేరు యూఏఎన్ నంబర్ల వల్ల కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ కన్ఫ్యూజన్‌లో వరుసగా తప్పు పాస్‌వర్డ్‌లు టైప్ చేయడం, లేదా మొబైల్‌కు వచ్చిన ఓటీపీ టైమ్ అయిపోయినా పదే పదే ట్రై చేయడం వల్ల ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ అప్రమత్తం అవుతుంది. ఎవరో మీ అకౌంట్‌ను హ్యాక్ చేయడానికి చూస్తున్నారని భావించి, రక్షణ చర్యల్లో భాగంగా ఖాతాను తాత్కాలికంగా లాక్ చేస్తుంది. కొన్ని ఖాతాలు నిర్ణీత కూలింగ్-ఆఫ్ పీరియడ్ తర్వాత దానంతట అదే తెరుచుకుంటుంది. మరికొన్నింటికి పాస్‌వర్డ్ రీసెట్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ డేటాలో చిన్న తేడా ఉన్నా రిజెక్ట్
అకౌంట్ బ్లాక్ అవ్వడానికి లేదా సర్వీసులు నిలిచిపోవడానికి మరో ప్రధాన కారణం.. ఆధార్ కార్డులోని వివరాలు, పీఎఫ్ రికార్డుల్లోని వివరాలు ఒకదానితో ఒకటి మ్యాచ్ కాకపోవడం. సాధారణంగా ఉద్యోగులకు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి పీఎఫ్ నుంచి డబ్బులు తీయాలనుకున్నప్పుడే ఈ తప్పులు బయటపడుతుంటాయి. మీ పేరులోని స్పెల్లింగ్‌లో ఒక చిన్న అక్షరం తప్పున్నా, ఇంటిపేరు ఫార్మాట్ వేరుగా ఉన్నా, లేదా పుట్టిన తేదీ తప్పుగా నమోదైనా ఆధార్ వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయిపోతుంది. దీనితో పాటు, ఉద్యోగులు తమ వైపు నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌లో బ్యాంక్ అకౌంట్ లేదా కొత్త వివరాలు అప్‌డేట్ చేసినా.. కంపెనీ యాజమాన్యం తమ వైపు నుంచి డిజిటల్ సిగ్నేచర్ ద్వారా దాన్ని అప్రూవ్ చేయకపోతే బ్యాక్‌ఎండ్‌లో ఆ రిక్వెస్ట్ అలాగే ఉండిపోతుంది. దీనివల్ల కూడా ఆన్‌లైన్ సేవలు నిలిచిపోతాయి.
ఇంట్లోనే కూర్చుని మొబైల్‌తో అన్‌లాక్ చేసుకునే సింపుల్ ప్రాసెస్
ఒకవేళ మీ పీఎఫ్ అకౌంట్ కూడా ఇలాగే లాక్ అయితే, దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో ఉన్న Forgot Password ఆప్షన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం ఆధార్ లింక్డ్ ఓటీపీ ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి మీ ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీ దగ్గర యాక్టివ్‌గా ఉండాలి. పోర్టల్‌లోకి వెళ్లి Forgot Password పై క్లిక్ చేసి, మీ యూఏఎన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి, మీ వివరాలు కరెక్ట్‌గా ఇస్తే కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. దీనితో మీ అకౌంట్ మళ్లీ అన్‌లాక్ అయిపోతుంది. కేవైసీ లేదా కంపెనీ అప్రూవల్ పెండింగ్ ఉంటే మాత్రం మీ ప్రస్తుత లేదా పాత కంపెనీ హెచ్ఆర్ విభాగాన్ని సంప్రదించి ఆన్‌లైన్ రిక్వెస్ట్‌ను వెంటనే అప్రూవ్ చేయమని కోరాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో కాకపోతే చివరి ఆప్షన్ ఇదే
సాంకేతిక కారణాల వల్ల లేదా డేటా పూర్తిగా తప్పుగా ఉండటం వల్ల ఒకవేళ ఆన్‌లైన్ పద్ధతుల్లో మీ అకౌంట్ ఓపెన్ కాకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికోసం ఈపీఎఫ్ఓ అధికారిక గ్రీవాన్స్ పోర్టల్ (EPFiGMS) లో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే, చివరి ఆప్షన్‌గా మీ దగ్గరలోని ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయానికి (Regional EPFO Office) స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ మరియు మీ ఉద్యోగానికి సంబంధించిన జాయినింగ్ లెటర్ లేదా ఐడీ కార్డు లాంటి పత్రాలను సబ్మిట్ చేసి, ఉమ్మడి డిక్లరేషన్ ఫారమ్ ద్వారా మీ అకౌంట్‌ను మ్యాన్యువల్‌గా అన్‌లాక్ చేయించుకోవచ్చు.

