ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు తమ పీఎఫ్ డబ్బును సులభంగా విత్ డ్రా చేసుకునేందుకు త్వరలో ఒక విప్లవాత్మకమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే, 2026 జనవరి నుండి ఈ సౌకర్యం అందుబాటులోకి రావచ్చు. ఇది పీఎఫ్ డబ్బును నేరుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఏటీఎంల ద్వారా డబ్బు విత్‌డ్రా ఎలా?

ఈపీఎఫ్ఓ సభ్యులకు పీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా నేరుగా విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పించేందుకు, ఈపీఎఫ్ఓ తన ఐటీ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సాంకేతిక సంసిద్ధతకు త్వరలో సీబీటీ ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఈపీఎఫ్ఓ సభ్యులు ఏటీఎంలలో ఎంత మొత్తంలో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు, విత్‌డ్రాయల్ లిమిట్ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. త్వరలో జరగబోయే సీబీటీ సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పీఎఫ్ విత్‌డ్రాయల్‌లో ప్రస్తుత పరిస్థితి

ప్రస్తుత వ్యవస్థలో, ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాలోని డబ్బును తీసుకోవాలంటే ఒక ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. ముందుగా, అవసరమైన కారణాలను తెలుపుతూ క్లెయిమ్ దాఖలు చేయాలి. ఆ క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత, ఆ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. అప్పుడు ఉద్యోగులు ఆ డబ్బును సాధారణ పద్ధతిలో విత్‌డ్రా చేసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.

కొత్త ఏటీఎం ఫీచర్

కొత్త ఏటీఎం ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. సభ్యులు నేరుగా తమ పీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం, ఈపీఎఫ్ఓ తన సభ్యులకు ఏటీఎం కార్డులాంటి ఈపీఎఫ్ కార్డును అందించే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ కొత్త సదుపాయం బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంల నుంచి తీసుకున్నట్లుగానే ఉండవచ్చు. ఇది పీఎఫ్ డబ్బును అత్యవసర సమయంలో సులభంగా, త్వరగా పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈపీఎఫ్ఓ నుండి ఈ సదుపాయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే, ఈ ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయం రాబోతోందనే విషయం మాత్రం నిజమని తెలుస్తోంది. త్వరలోనే డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలి, లిమిట్ ఎంత వంటి వివరాలు వెల్లడవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story