EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు
48 గంటల్లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు

EPFO : ఉద్యోగస్తులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గతంలో పీఎఫ్ అకౌంట్ నుంచి సొంత డబ్బులు ఉపసంహరించుకోవాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగడం, అప్లై చేశాక వారాల తరబడి వేచి చూడడం తప్పేది కాదు. అయితే ఈ పరిస్థితికి ముగింపు పలుకుతూ ఈపీఎఫ్ఓ సాంకేతికతను భారీగా అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసిన కేవలం 24 నుంచి 48 గంటల్లోనే క్లెయిమ్ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అత్యవసర వైద్య ఖర్చులు, వివాహాలు, లేదా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అవసరమైనప్పుడు ఈ వేగవంతమైన సెటిల్మెంట్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
90 శాతం క్లెయిమ్‌లు ఆటో-సెటిల్
ఈపీఎఫ్ఓ సీనియర్ అధికారి రమేష్ కృష్ణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ ఆఫీసుల్లో పాత క్లెయిమ్‌ల పెండింగ్ సమస్యకు స్వస్తి పలికారు. ప్రస్తుతం సరికొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా దాదాపు 90 శాతం పీఎఫ్ క్లెయిమ్‌లు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా కంప్యూటర్ ద్వారానే స్వయంసిద్ధంగా పాస్ అవుతున్నాయి. సిస్టమ్ ఆధారిత పరిశీలన వల్ల అవినీతి, ఆలస్యానికి తావులేకుండా ఉద్యోగుల దరఖాస్తులు వెనువెంటనే ఆమోదం పొందుతున్నాయి.
భీమ్ యాప్ ద్వారా యూపీఐకి పీఎఫ్ సొమ్ము
డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ మరో ముందడుగు వేస్తోంది. భీమ్ యాప్ ద్వారా పీఎఫ్ క్లెయిమ్ సొమ్మును నేరుగా యూపీఐతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలోకి పంపే ప్రక్రియను ప్రారంభించబోతోంది. వచ్చే నెల రోజుల్లో ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. దీనివల్ల లావాదేవీలు మరింత వేగంగా, పారదర్శకంగా జరగనున్నాయి.
గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్‌కు పీఎఫ్ భద్రత
కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికీ సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇ-కామర్స్ కంపెనీల్లో పనిచేసే డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్లను పీఎఫ్ పరిధిలోకి తీసుకురావడానికి కొత్త చట్టంలో ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. దీనిపై అధికారిక ప్రకటన రాగానే లక్షలాది మంది రోజువారీ కార్మికుల భవిష్యత్తుకు భరోసా లభించనుంది.
వడ్డీ రేట్లపై కీలక అప్‌డేట్
ప్రస్తుతం పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీని ఈపీఎఫ్ఓ అందిస్తోంది. ఇటీవల కాలంలోనే ఏకంగా 34 కోట్లకు పైగా ఖాతాదారులకు కలిపి సుమారు రూ. 1.44 లక్షల కోట్ల వడ్డీ సొమ్మును ఈపీఎఫ్ఓ జమ చేసి రికార్డు సృష్టించింది. వడ్డీ రేట్ల పెంపుపై ఇప్పుడు మాట్లాడటం తొందరపాటే అవుతుందని, అయితే కాగిత రహిత విధానం ద్వారా డిజిటలైజేషన్‌ను పెంచి ఉద్యోగుల నమ్మకాన్ని మరింత పెంచడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది.

