ఈపీఎఫ్ఓ కొత్త నియమాలు ఇవే!

EPFO : ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద ఆర్థిక భద్రత. ఆకస్మికంగా డబ్బు అవసరమైనప్పుడు ఈపీఎఫ్ నిధిని ఉపయోగించుకునే సౌలభ్యం ఉద్యోగులకు చాలా ప్రయోజనకరం. అయితే ఈ నిధిలో జమ అయ్యే డబ్బు మీదే అయినప్పటికీ, దాన్ని ఉపసంహరించుకోవడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా, వివాహం వంటి ముఖ్యమైన అవసరాల కోసం పీఎఫ్ నుంచి డబ్బు తీసుకునే ప్రక్రియను EPFO ఇప్పుడు మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది.

ఈపీఎఫ్‌ఓ విడుదల చేసిన కొత్త నియమాల ప్రకారం.. ఉద్యోగి తన వివాహం కోసం లేదా కుటుంబంలోని ఏ సభ్యుడి వివాహం కోసం అయినా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవడం గతంలో కంటే చాలా సులభమైంది. సభ్యులు తమ పీఎఫ్ నిధిలోని మొత్తం డబ్బులో 100% వరకు (ఉద్యోగి, యాజమాన్యం వాటా కలిపి) తీయడానికి అవకాశం కల్పించారు. వివాహం కోసం డబ్బు తీసుకునే గరిష్ట సంఖ్యను 3 సార్ల నుంచి 5 సార్లకు పెంచారు. అంటే, సర్వీస్ కాలంలో మొత్తం ఐదు సార్లు డబ్బు తీయవచ్చు.

గతంలో వివాహం కోసం డబ్బు తీయాలంటే కనీసం 7 సంవత్సరాల ఉద్యోగ కాలం అవసరం ఉండేది. ఈ పరిమితిని భారీగా తగ్గించి కేవలం 12 నెలలకు పరిమితం చేశారు. కొత్త నిబంధనలలో అత్యంత ముఖ్యమైన మార్పు పత్రాల అవసరం గురించే. పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై వివాహ ఆహ్వాన పత్రిక (మ్యారేజ్ కార్డ్) లేదా మరే ఇతర ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్) ఇవ్వాల్సిన అవసరం లేదు. సభ్యులు కేవలం ఒక సాధారణ డిక్లరేషన్ ఫారం ఇస్తే సరిపోతుంది. ఈ పత్రాల అవసరం తొలగిపోవడంతో డబ్బు పొందే ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తవుతుంది. ఈ మార్పులు పెళ్లి ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story