EPF Insurance: దేశంలో లక్షలాది మంది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ ఒక ప్రధాన ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. ప్రతి నెలా జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ సొమ్ము భవిష్యత్తు పొదుపుగా ఉపయోగపడటమే కాకుండా ఈపీఎఫ్‌ఓ ఉద్యోగులకు రూ.7 లక్షల వరకు ఉచిత బీమా సదుపాయాన్ని అందిస్తోంది. ఈ ప్రత్యేక స్కీమ్ గురించి ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాలి.

ఈడీఎల్ఐ రూపంలో ఉచిత బీమా భరోసా

ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగుల రక్షణ కోసం ఈపీఎఫ్‌ఓ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) పథకాన్ని అమలు చేస్తోంది. సర్వీసులో ఉన్న సమయంలో ఉద్యోగి ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబానికి లేదా నామినీకి ఈ ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీల కోసం ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి తన జీతం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రీమియం సొమ్మును పూర్తిగా యాజమాన్యమే భరిస్తుంది.

గత 12 నెలల జీతం ఆధారంగా లెక్కింపు

బాధిత కుటుంబానికి అందే బీమా పరిహారాన్ని ఉద్యోగి పొందిన చివరి 12 నెలల సగటు వేతనం, కరువు భత్యం ఆధారంగా లెక్కిస్తారు. ప్రస్తుతం ఈ లెక్కింపు కోసం గరిష్ట వేతన పరిమితిని రూ.15,000గా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఉద్యోగంలో ఉన్న కాలంలో పొందిన జీతం ఆధారంగా ఈ పరిహారం లెక్కింపు వేగంగా పూర్తవుతుంది. దీని ద్వారా నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యోగి అకాల మరణం పొందితే తక్షణ ఆర్థిక భద్రత లభిస్తుంది.

రూ.7 లక్షల వరకు గరిష్ట ఆర్థిక సాయం

లెక్కింపు విధానం ప్రకారం ఉద్యోగి పొందే సగటు జీతానికి 30 రెట్ల మొత్తాన్ని లెక్కిస్తారు. దానికి అదనంగా పీఎఫ్ ఖాతాలోని చివరి 12 నెలల సగటు నిల్వపై 50 శాతం మొత్తాన్ని (గరిష్టంగా రూ.1.75 లక్షలు) బోనస్‌గా జతచేస్తారు. ఇలా లెక్కించగా వచ్చే మొత్తం ప్రయోజనం గరిష్టంగా రూ. 7 లక్షల వరకు నామినీకి లభిస్తుంది. నామినీగా ఉన్నవారు అవసరమైన పత్రాలను సమర్పించి నేరుగా ఈ ఆర్థిక సాయాన్ని తమ బ్యాంకు ఖాతాల్లోకి పొందవచ్చు.

Next Story