EPFO: దేశంలోని ఉద్యోగులు అలాగే యాజమాన్యాలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరటనిచ్చింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన పీఎఫ్ రిటర్న్ దాఖలు చేసే గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ గడువు అక్టోబర్ 15తో ముగియాల్సి ఉండగా, కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సంస్థలకు ఈసీఆర్ ఫైల్ చేయడానికి అలాగే ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమ చేయడానికి తగినంత అదనపు సమయం లభిస్తుంది.

పీఎఫ్ నియమాలలో వస్తున్న ఎప్పటికప్పుడు మార్పుల కారణంగా కంపెనీలు తమ పేరోల్ సిస్టమ్‌లో అవసరమైన సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనాల లెక్కింపు, అర్హతలు అలాగే పీఎఫ్ చందా వివరాలను సరిగ్గా అప్‌డేట్ చేయడానికి ఈ అదనపు సమయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి యాజమాన్యాలకు అవకాశం దొరుకుతుంది. తద్వారా ఉద్యోగుల రికార్డులలో ఎలాంటి తప్పులు తలెత్తకుండా సరిగ్గా సరిచూసుకునే వీలుంటుంది.

ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ద్వారా కంపెనీలు ప్రతి నెలా ఉద్యోగుల జీతాలకు సంబంధించిన సామాజిక భద్రతా పథకాల వివరాలు అందించాలి. ఇందులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) అలాగే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) తాలూకు కాంట్రిబ్యూషన్ వివరాలు కచ్చితంగా ఉండాలి. రిటర్న్ దాఖలు చేసే ముందు ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించడం చాలా ముఖ్యం. తప్పుడు సమాచారం నమోదు చేస్తే భవిష్యత్తులో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

కేవలం కంపెనీలు మాత్రమే కాకుండా ఉద్యోగులు కూడా తమ సాలరీ స్లిప్స్ అలాగే పీఎఫ్ ఖాతాలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. వేతనం నుంచి కట్ అవుతున్న పీఎఫ్ మొత్తం సకాలంలో ఖాతాలో జమ అవుతుందో లేదో గమనించడం మంచిది. అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించడంతో యాజమాందాలు ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. గడువులోగా రిటర్న్స్ సమర్పించడం ద్వారా ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా భద్రత కల్పించవచ్చు.

Next Story