EPFO: ఉద్యోగులు పనిచేసే సమయంలో తమ జీతంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యజమాని కూడా తన వంతు వాటా అందిస్తారు. ఈ డబ్బు ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అర్హత ఉన్న ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇకపై మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోకుండా, కొంత మొత్తాన్ని ఖాతాలోనే ఉంచి అవసరమైనప్పుడు విడతల వారీగా తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. ఇందుకోసం SWP విధానాన్ని పరిశీలిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే ఖాతాలో మిగిలిన మొత్తంపై వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు ఎలా తీసుకోవచ్చు?

ప్రస్తుతం 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో రిటైర్ అయ్యే ఉద్యోగులు తమ అర్హత ప్రకారం పీఎఫ్‌లోని మొత్తం నిల్వను ఒకేసారి తీసుకోవచ్చు. 55 ఏళ్లలోపు ఉద్యోగం మానేసిన వారు ఫారం 31 ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు వెంటనే తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 25 శాతం మొత్తాన్ని నిరంతరంగా 12 నెలలు నిరుద్యోగిగా ఉన్న తర్వాత ఫైనల్ సెటిల్‌మెంట్ కింద తీసుకోవచ్చు. మరోవైపు EPS పెన్షన్ పొందేందుకు సాధారణంగా 58 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఈ నిబంధనల్లో మార్పులు చేయాలా? ఉద్యోగులకు మరిన్ని విత్‌డ్రా ఆప్షన్లు ఇవ్వాలా? అనే అంశాలను ఈపీఎఫ్‌ఓ పరిశీలిస్తోంది.

ఈరోజు కీలక సమావేశం.. ఏం చర్చించనున్నారు?

ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు నవంబర్ 19న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశం కానుంది. ఈ బోర్డు ఈపీఎఫ్‌ఓలో కీలక నిర్ణయాలు తీసుకునే సంస్థ. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగులు, యజమానుల ప్రతినిధులు ఉంటారు. పీఎఫ్ నిధులు, వడ్డీ రేట్లు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ బోర్డు చర్చిస్తుంది. అయితే సమావేశంలో ప్రతిపాదనలు చర్చకు రావడం వేరు, వాటికి తుది ఆమోదం లభించి అమల్లోకి రావడం వేరు. కాబట్టి కొత్త నిబంధనలు ఖరారయ్యాయని ఇప్పుడే చెప్పలేం.

కనీస పెన్షన్ రూ.3,000కు పెరుగుతుందా?

ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద ప్రస్తుతం అర్హులైన పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000గా ఉంది. దీన్ని రూ.3,000కు పెంచే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే తక్కువ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు కొంత ఊరట కలగవచ్చు. అయితే పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.

పీఎఫ్ నుంచి పెన్షన్‌కు ఎంత మొత్తం వెళ్తుంది?

ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు యజమాని జమ చేసే 12 శాతం వాటాలో 8.33 శాతం EPS పెన్షన్ పథకానికి వెళ్తుంది. మిగిలిన 3.67 శాతం EPF ఖాతాలో జమ అవుతుంది. EPS కింద సభ్యుడికి లెక్కించిన పెన్షన్ రూ.1,000 కంటే తక్కువగా ఉంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ కనీస పెన్షన్ హామీ ప్రకారం ఆ మొత్తాన్ని రూ.1,000కు చేర్చేందుకు కేంద్రం సాయం అందిస్తుంది. ఇప్పుడు ఈ కనీస మొత్తాన్ని రూ.3,000కు పెంచాలనే ప్రతిపాదనపై చర్చ జరగవచ్చని సమాచారం.

సమావేశం తర్వాతే దీనిపై స్పష్టత

తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త SWP విధానంలో ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను నెలవారీగా, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి తీసుకునే అవకాశం కల్పించవచ్చని సమాచారం. మిగిలిన డబ్బుపై పీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది. అవసరమైతే మధ్యలోనే ఈ విధానం నుంచి బయటకు వచ్చి మిగిలిన మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఖాతాదారుడు మరణిస్తే, మిగిలిన మొత్తానికి సంబంధించి జీవిత భాగస్వామి లేదా నామినీకి ఈ పథకాన్ని కొనసాగించే అవకాశం కల్పించవచ్చని సమాచారం.

Next Story