EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే ప్రక్రియను మరింత సరళతరం చేసింది. చదువు, వైద్యం, సొంతింటి కల వంటి మూడు కీలక అవసరాలకు ఈపీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకునే నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈపీఎఫ్‌ఓ తన సభ్యుల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్ నిబంధనలను సవరించింది. సాధారణంగా రిటైర్మెంట్ నిధిగా భావించే ఈపీఎఫ్ నిధుల నుంచి అత్యవసర సమయంలో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ అడ్వాన్స్ సౌకర్యాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించారు. అందులో వ్యక్తిగత అత్యవసరాలు, ఇల్లు నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం, ప్రత్యేక అనుకోని పరిస్థితులు ఉన్నాయి. అర్హత కలిగిన ప్రతి సభ్యుడు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు.

పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు సులభంగా నిధులు

కుటుంబంలో హఠాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువుల భారాన్ని తగ్గించేందుకు ఈపీఎఫ్ అడ్వాన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యవసర వైద్య చికిత్సలు, సొంత చదువు లేదా పిల్లల చదువుల కోసం ఖాతాదారులు తమ పీఎఫ్ నిధి నుంచి అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ క్లెయిమ్ చేసేముందు సభ్యులు తమ సర్వీస్ కాలం, ఖాతాలో ఉన్న నిల్వ, అడ్వాన్స్ పరిమితులను ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు సులువుగా మంజూరవుతాయి.

సొంతింటి కల నెరవేర్చుకునేందుకు వెసులుబాటు

ఇల్లు కొనుగోలు చేయడం లేదా పాత ఇంటిని పునర్నిర్మించడం వంటి గృహ అవసరాలకు కూడా పీఎఫ్ నిధులను వాడుకోవచ్చు. ఉద్యోగి సర్వీస్ కాలం, పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం ఆధారంగా ఈ అడ్వాన్స్ పరిమితి ఆధారపడి ఉంటుంది. కేవలం ఖాతాలో తగినంత డబ్బు ఉంటే సరిపోదు, ఆయా కేటగిరీకి సంబంధించిన సర్వీస్ నిబంధనలు కూడా పూర్తయి ఉండాలి. ప్రతి అవసరానికి వేర్వేరు పరిమితులు, నిబంధనలు వర్తిస్తాయి.

డబ్బులు తీసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఈపీఎఫ్ అనేది ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే సుదీర్ఘకాల పొదుపు మార్గం. అత్యవసరం కానప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి నిధులు విత్‌డ్రా చేయకపోవడమే మంచిది. క్లెయిమ్ చేయడానికి ముందు విత్‌డ్రా పరిమితులు, సర్వీస్ కాలపరిమితి, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలి. సరైన అవగాహనతో అప్లై చేస్తేనే ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా క్లెయిమ్ త్వరగా పూర్తి అవుతుంది.

Next Story