EPFO : నిరుద్యోగులకు భారీ షాక్.. ఉద్యోగం పోతే పీఎఫ్ డబ్బు కోసం ఏకంగా ఏడాది నిరీక్షణ తప్పదా?
ఉద్యోగం పోతే పీఎఫ్ డబ్బు కోసం ఏకంగా ఏడాది నిరీక్షణ తప్పదా?

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన కోట్లాది మంది సభ్యుల కోసం పీఎఫ్ డబ్బు విత్‌డ్రా నిబంధనల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన సోమవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో కొన్ని ఊరటనిచ్చే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయి ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి ఇబ్బంది కలిగించే కఠినమైన షరతులు కూడా ఉన్నాయి.
మొదట సానుకూల మార్పుల గురించి మాట్లాడుకుంటే... ఈపీఎఫ్ఓ పాక్షిక విత్‌డ్రాల నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితులు అంటే, తీవ్ర అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య, వివాహం లేదా సొంతిల్లు కొనుగోలు వంటి వాటి కోసం పీఎఫ్ డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త నిబంధన ప్రకారం, కేవలం 12 నెలల సర్వీస్ పూర్తి చేసిన తర్వాతే ఈ అవసరాలకు డబ్బు తీసుకోవచ్చు. గతంలో ఇల్లు కొనుగోలు వంటి పెద్ద అవసరాలకు కనీసం 5 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి ఉండేది. ఈ నిరీక్షణను తగ్గించడం ఉద్యోగులకు పెద్ద ఉపశమనం.
కొత్త నిబంధనల్లో ఉద్యోగులకు ఆందోళన కలిగించే అంశం ఒకటి ఉంది. మీ పీఎఫ్ ఖాతాలో మీరు జమ చేసిన మొత్తం నుంచి 25 శాతం వాటా ఎల్లప్పుడూ మినిమం బ్యాలెన్స్గా కొనసాగాలి. అంటే, సభ్యులు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఖాతాను పూర్తిగా ఖాళీ చేయలేరు. ఈపీఎఫ్ఓ వాదన ప్రకారం, ఈ నిబంధన వల్ల సభ్యులకు 8.25% అధిక వడ్డీ రేటు ప్రయోజనం దక్కుతుంది. అంతేకాక, పదవీ విరమణ కోసం కనీస పొదుపు ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. అయితే, ఇది తమ సొంత కష్టార్జితంలో కొంత భాగాన్ని దీర్ఘకాలం పాటు వినియోగించుకోకుండా నిలిపివేయడం అవుతుందని విమర్శలు వస్తున్నాయి.
అత్యంత ఆందోళనకరమైన మార్పు పూర్తి విత్‌డ్రా నిబంధనలో జరిగింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి రెండు నెలల తర్వాత తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును తీసుకునే అవకాశం ఉండేది. నిరుద్యోగ సమయంలో ఈ మొత్తం ఆర్థిక భరోసా ఇచ్చేది. కానీ, ఇప్పుడు ఈ నిరీక్షణ సమయాన్ని ఏకంగా 12 నెలలకు పెంచారు. అంటే, ఉద్యోగం పోయిన తర్వాత కూడా పీఎఫ్ డబ్బు కోసం ఏకంగా ఒక సంవత్సరం పాటు ఎదురుచూడక తప్పదు.
పీఎఫ్ మాదిరిగానే పెన్షన్ మొత్తం విత్‌డ్రా చేసుకునే నిబంధనలు కూడా కఠినతరం అయ్యాయి. ఇంతకుముందు రెండు నెలల నిరీక్షణ తర్వాత పెన్షన్ డబ్బు తీసుకోగలిగేవారు. ఇప్పుడు ఆ గడువును 36 నెలలకు పెంచారు. దీంతో పాటు, ఈపీఎఫ్ఓ పేపర్ లెస్ సేవలను మెరుగుపరచడం, విశ్వాస్ యోజనను ప్రారంభించడం ద్వారా మునుపటి పెనాల్టీ కేసులను తగ్గించడం, పెన్షనర్లకు ఇంటి వద్ద నుంచే ఉచిత డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే సౌకర్యాన్ని ప్రారంభించడం వంటి ఇతర సానుకూల నిర్ణయాలను కూడా తీసుకుంది.
