EPFO: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే కోట్లాది మందికి, వారికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలకు ఈపీఎఫ్‌వో ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 2026 నెలకి సంబంధించిన పీఎఫ్ చందాను చెల్లించడానికి నవంబర్ 15వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ డెడ్‌లైన్‌ను గుర్తు చేసింది. నిర్దేశిత గడువులోగా ఈసీఆర్ ప్రక్రియతో పాటు పీఎఫ్ బకాయిల చెల్లింపును పూర్తి చేయాలని యజమానులకు స్పష్టం చేసింది.

సమయానికి చెల్లించకపోతే ఆర్థిక భారం

కంపెనీలు నవంబర్ 15వ తేదీలోగా పీఎఫ్ జమ చేయడంలో విఫలమైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గడువు దాటిన తర్వాత చెల్లించే పీఎఫ్ మొత్తాలపై ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం వడ్డీ పడుతుంది. దీనికి అదనంగా యాజమాన్యాలపై జరిమానా కూడా విధిస్తారు. చివరి నిమిషం వరకు వేచి చూస్తే పోర్టల్ సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఉద్యోగుల వివరాల్లో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది.

ఈసీఆర్ రిపోర్ట్ ప్రాముఖ్యత ఏమిటి

పీఎఫ్ చెల్లింపుల ప్రక్రియలో ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ఈసీఆర్) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రతి నెలా కంపెనీలు సమర్పించే ఒక అధికారిక నివేదిక. ఇందులో ప్రతి ఉద్యోగి పేరు, వ్యక్తిగత వివరాలు, నెలవారీ జీతం, పీఎఫ్ ఖాతాలోకి వెళ్లాల్సిన మొత్తం స్పష్టంగా నమోదై ఉంటాయి. కేవలం ఈసీఆర్ ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసినంత మాత్రాన బాధ్యత తీరిపోదు. ఆ నివేదిక ఆధారంగా నిర్దేశిత మొత్తాన్ని చలానా ద్వారా చెల్లించినప్పుడే పీఎఫ్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఉద్యోగులకు భరోసా కల్పించే చర్యలు

కంపెనీలు ప్రతి నెలా సక్రమంగా పీఎఫ్ జమ చేయడం వల్ల ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత ఉంటుంది. సకాలంలో డబ్బు జమ కావడం వల్ల ఉద్యోగులు ఎలాంటి అంతరాయాలు లేకుండా తమ పీఎఫ్ ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ చివరి నిమిషంలో హడావుడి చేస్తే ఉద్యోగుల రికార్డుల్లో తప్పులు వచ్చి భవిష్యత్తులో లోన్ లేదా క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎలాంటి జరిమానాలు పడకుండా నవంబర్ 15 లోపే బాధ్యతగా పీఎఫ్ చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story