EPFO : గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్
భారీగా పెరగనున్న రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకంలో ఒక ముఖ్యమైన మార్పు చేయడానికి సిద్ధమవుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000 కు పెంచడానికి ఒక ప్రతిపాదనను తయారు చేస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు ఈపీఎస్ పెన్షన్ పరిధిలోకి వస్తారు. భవిష్యత్తులో వారికి మెరుగైన పెన్షన్ లభిస్తుంది. చివరిసారిగా ఈ పరిమితిని 2014 లో రూ.6,500 నుంచి రూ.15,000 కు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు మార్చలేదు.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకం ఈపీఎస్ కింద ఒక వేతన పరిమితిని నిర్ణయించారు. అది నెలకు రూ.15,000. దీని అర్థం, ఉద్యోగి జీతం రూ.25,000, రూ.40,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ పెన్షన్ లెక్క కేవలం రూ.15,000 ఆధారంగా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.25,000 కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల జీతం ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు కూడా పెన్షన్ లెక్కించడానికి బేస్ పెరుగుతుంది. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత వారికి వచ్చే పెన్షన్ మొత్తం మెరుగ్గా ఉంటుంది.
ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ.. రూ.15,000 కంటే కొంచెం ఎక్కువ సంపాదించే చాలా మంది పెన్షన్ పరిధిలో లేకపోవడం వల్ల వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆదాయ పరిస్థితులను ఈ పాత పరిమితులు ప్రతిబింబించడం లేదని, అందుకే వాటిని మార్చడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతను పెంచడానికి, పెన్షన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈపీఎస్ లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. ఈపీఎస్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను 2 నెలల నుంచి 36 నెలలకు పెంచారు. అంటే ఒక ఉద్యోగి 3 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయకుండా లేదా నిరుద్యోగిగా ఉంటేనే తన ఈపీఎస్ డబ్బును తీసుకోగలరు. ఈ మార్పు అకాల విత్ డ్రాలను నిరోధించి, ప్రజలు దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంది.
నెలకు రూ.1,000 కనీస పెన్షన్ పరిమితిని కూడా ప్రభుత్వం తిరిగి సమీక్షిస్తోంది. గత 11 సంవత్సరాలుగా ఈ పరిమితిలో ఎలాంటి మార్పు రాలేదు. పార్లమెంటరీ కమిటీ కూడా ఈ మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేసింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది, ఇది పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది.

