ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా డబ్బులు డ్రా

EPFO : ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ డబ్బులు తీసుకోవడం ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినంత ఈజీ కాబోతోంది. ఇప్పటివరకు పీఎఫ్ క్లెయిమ్ చేయాలంటే ఆన్ లైన్ లో అప్లై చేసి, వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు యూపీఐ ద్వారా క్షణాల్లో మీ పీఎఫ్ డబ్బులను మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకునే వెసులుబాటు రాబోతోంది. ఏప్రిల్ 2026 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్ ద్వారా ఈ విప్లవాత్మక మార్పు మొదలవ్వనుంది.

ప్రస్తుతం పీఎఫ్ సభ్యులు తమ పాస్‌బుక్ చూసుకోవాలన్నా లేదా ఇతర సేవల కోసమైనా UMANG యాప్ లేదా UAN పోర్టల్‌పై ఆధారపడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈపీఎఫ్ఓ కేవలం తన సేవల కోసమే ఒక ప్రత్యేకమైన, అత్యాధునికమైన మొబైల్ అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. ఏప్రిల్ నెలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఇందులో యూపీఐ గేట్‌వేను అనుసంధానించడం వల్ల, ఉద్యోగులు తమ అకౌంట్‌లో ఉన్న డబ్బును నేరుగా లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలోకి క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా పాస్‌బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, నామినీని మార్చుకోవడం వంటి పనులన్నీ ఈ యాప్ ద్వారానే పూర్తి చేయవచ్చు.

ఎంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?

ప్రభుత్వం పీఎఫ్ నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. దీని ప్రకారం, పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో కొంత భాగాన్ని (ఉదాహరణకు 20% నుంచి 40% వరకు) భవిష్యత్తు అవసరాల కోసం అలాగే ఫ్రీజ్ చేసి, మిగిలిన మొత్తాన్ని అత్యవసర అవసరాల కోసం వాడుకునేలా వెసులుబాటు కల్పించాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ల కోసం కూడా రోజువారీ పరిమితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి డమ్మీ ఖాతాలపై ట్రయల్స్ నడుస్తున్నాయి. సాంకేతిక సమస్యలు ఏవీ లేవని నిర్ధారించుకున్న తర్వాత దీనిని బహిరంగంగా విడుదల చేస్తారు.

ఆటో-సెటిల్‌మెంట్ మ్యాజిక్

గతంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం దరఖాస్తు చేస్తే అది అధికారుల వెరిఫికేషన్ తర్వాత బ్యాంక్ అకౌంట్ లోకి రావడానికి వారాల సమయం పట్టేది. కానీ కొత్తగా తీసుకొచ్చిన ఆటో సెటిల్‌మెంట్ మోడ్ ద్వారా ఎటువంటి మాన్యువల్ ప్రమేయం లేకుండా కేవలం 3 రోజుల్లోనే డబ్బులు జమ అవుతాయి. ఈ ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని కూడా ప్రభుత్వం రూ. 1 లక్ష నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచింది. అంటే మీ అత్యవసర ఖర్చులకు 5 లక్షల వరకు అప్లై చేస్తే మూడు రోజుల్లోనే మీ చేతికి డబ్బులు వస్తాయన్నమాట.

సాలరీడ్ క్లాస్‌కు పెద్ద ఉపశమనం

ప్రైవేట్ ఉద్యోగులు తమ సొంత డబ్బు కోసం పడరాని పాట్లు పడకూడదనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ వినూత్న మార్పులను చేపట్టింది. ముఖ్యంగా అనారోగ్యం, పెళ్లిళ్లు లేదా ఇల్లు కొనుగోలు వంటి సమయాల్లో ఈ యూపీఐ సౌకర్యం వరంలా మారుతుంది. ఈపీఎఫ్ఓను ఒక కార్పొరేట్ బ్యాంక్ స్థాయిలో బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది అమల్లోకి వస్తే భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story