EPFO : జంతర్ మంతర్ వద్ద పెన్షనర్ల మహా గర్జన..కనీస పెన్షన్ రూ.7,500 చేయాల్సిందేనని డిమాండ్
కనీస పెన్షన్ రూ.7,500 చేయాల్సిందేనని డిమాండ్

EPFO : జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని, దేశాభివృద్ధిలో భాగస్వాములైన లక్షలాది మంది వృద్ధులు ఇప్పుడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ఉన్న పెన్షనర్లు తమ కనీస పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి (మార్చి 9) ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల నిరసన కార్యక్రమం కేవలం డబ్బు కోసం చేస్తున్న పోరాటం కాదు, దశాబ్దాల పాటు సేవ చేసిన సుమారు 81 లక్షల మంది విశ్రాంత ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటం.
ఒక ఉద్యోగి 30 నుంచి 35 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసి, ప్రతి నెలా తన జీతం నుంచి పెన్షన్ వాటాను ఈపీఎఫ్ఓలో జమ చేస్తాడు. కానీ రిటైర్మెంట్ తర్వాత అతనికి వస్తున్న సగటు పెన్షన్ కేవలం రూ.1,171 మాత్రమే. పెరిగిన ధరల యుగంలో ఈ కాలేజీ కుర్రాళ్ల పాకెట్ మనీ కంటే తక్కువగా ఉన్న ఈ మొత్తంతో నెలకు సరిపడా రేషన్ కూడా రాదు. మరి మందులు, ఇంటి ఖర్చులు ఎలా వెళ్లదీయాలి? ఇదే ప్రశ్నను ఈపీఎస్-95 నేషనల్ అజిటేషన్ కమిటీ ప్రభుత్వం ముందు ఉంచుతోంది. కమాండర్ అశోక్ రౌత్ నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్, సహకార రంగాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు గత తొమ్మిదేళ్లుగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆర్-పార్ పోరాటానికి దిగారు.
చికిత్స అందక రోజుకు 200 మందికి పైగా మృతి
కమిటీ వెల్లడించిన గణాంకాలు సభ్యసమాజాన్ని కలవరపెడుతున్నాయి. తక్కువ పెన్షన్ కారణంగా సరైన పౌష్టికాహారం తీసుకోలేక, ఉచిత వైద్య సదుపాయాలు లేక దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 200 నుంచి 250 మంది పెన్షనర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ముసలితనంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు వేలల్లో ఖర్చవుతుంటే, చేతికి వచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ ఏ మూలకు సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభం సందర్భంగా మార్చి 9, 10, 11 తేదీల్లో దేశ రాజధానిలో నిరసన జ్వాలలు రగిలిస్తున్నారు.
పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు ఇవే:
ఈ ఆందోళనలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు:
* కనీస పెన్షన్ పెంపు: ప్రస్తుతమున్న వెయ్యి రూపాయల కనిష్ట పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలి. దీనికి అదనంగా కరువు భత్యం కూడా జోడించాలి.
* ఉచిత వైద్యం: పెన్షనర్లతో పాటు వారి జీవిత భాగస్వాములకు కూడా ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలి.
* సుప్రీంకోర్టు తీర్పు అమలు: నవంబర్ 4, 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అర్హులైన వారందరికీ గరిష్ట పెన్షన్ ప్రయోజనాలను సమానంగా అందించాలి.
* ఇతరులకు ఊరట: ఈ పథకం కిందకు రాని వారికి కూడా కనీసం నెలకు రూ.5,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు.
పెడచెవిన పెట్టిన సర్కార్
ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల దాకా అందరినీ కలిసి విజ్ఞప్తి చేసినా ఎవరూ స్పందించడం లేదని నేషనల్ అజిటేషన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాల నుండి పెన్షనర్లు తరలివస్తున్న ఈ నిరసనకు వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ మూడు రోజుల పోరాటమైనా కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెస్తుందా? లేదా ఆ 81 లక్షల మంది వృద్ధుల ఆశలు అడియాశలవుతాయా? అన్నది వేచి చూడాలి.

