పెట్రోల్ బంకులకు తాళం వేయాల్సిందేనా?

EV Market : ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో గత కొంతకాలంగా నెలకొన్న స్తబ్దతకు తెరపడనుంది. ముడి పదార్థాల కొరత, సబ్సిడీల తగ్గింపు వంటి సవాళ్లను అధిగమిస్తూ ఈవీ రంగం మళ్లీ జూలు విదిల్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా బ్యాటరీ మోటార్లలో వాడే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సరఫరా మెరుగుపడటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీ వాహనాల అమ్మకాలు 16 నుంచి 18 శాతం వరకు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్ల తయారీలో అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరా ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. గతంలో చైనా నుంచి వీటి దిగుమతుల్లో ఆటంకాలు కలగడం వల్ల ఉత్పత్తి కుంటుపడింది. ఫలితంగా ఈ ఏడాది ఈవీ అమ్మకాలు కేవలం 12-13 శాతానికే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు సరఫరా గొలుసు మెరుగుపడటంతో, కంపెనీలు భారీగా ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల మార్కెట్లో వాహనాల లభ్యత పెరిగి, ధరలు కూడా స్థిరపడే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు తగ్గినప్పటికీ, సామాన్యుడికి ఈవీ వాహనాలే లాభదాయకమని గణాంకాలు చెబుతున్నాయి. ఒక పెట్రోల్ స్కూటర్ నడపాలంటే కిలోమీటరుకు సగటున రూ.2 నుంచి రూ.2.50 ఖర్చవుతుంది. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే, కిలోమీటరుకు కేవలం 30 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. అంటే పెట్రోల్ బండితో పోలిస్తే ఈవీ బండిపై ప్రయాణం చాలా చౌక. అందుకే వినియోగదారులు కూడా దీర్ఘకాలిక ఆదాను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం టూ-వీలర్ మార్కెట్‌లో ఈవీల వాటా 7 శాతానికి పెరుగుతుందని అంచనా.

ఎలక్ట్రిక్ వాహనాల రేసులో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. మొదట్లో ఓలా, ఏథర్ వంటి కొత్త స్టార్టప్ కంపెనీలు హవా సాగించగా, ఇప్పుడు బజాజ్, టీవీఎస్, హీరో వంటి అనుభవజ్ఞులైన కంపెనీలు పుంజుకున్నాయి. జనవరి 2026 నాటికి ఈ పాత కంపెనీల మార్కెట్ వాటా ఏకంగా 62 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇది కేవలం 47 శాతమే. పాత కంపెనీలకు పెట్రోల్ వాహనాల వ్యాపారం కూడా ఉండటంతో అవి నష్టాలను తట్టుకోగలుగుతున్నాయి. కానీ కేవలం ఈవీలపైనే ఆధారపడిన స్టార్టప్‌లు ప్రతి వాహనంపై రూ.25,000 నుంచి రూ.35,000 వరకు నష్టపోతున్నాయి. వినియోగదారులు కూడా సర్వీస్ సెంటర్లు, నమ్మకమైన బ్రాండ్ల కోసమే చూస్తుండటంతో పాత కంపెనీలకు తిరుగులేకుండా పోయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story