Fact Check : మీ అకౌంట్లో రూ.46,715 పడ్డాయా? ఆ మెసేజ్ నమ్మితే మీ జేబు ఖాళీ అవ్వడం ఖాయం
ఆ మెసేజ్ నమ్మితే మీ జేబు ఖాళీ అవ్వడం ఖాయం

Fact Check : గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఒక మెసేజ్ విపరీతంగా షేర్ అవుతోంది. దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి అండగా నిలవాలని నిర్ణయించుకుందని, అందుకే ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రూ.46,715 జమ చేస్తోందని ఆ మెసేజ్ సారాంశం. ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు వస్తున్నాయని ఆశపడి చాలామంది ఈ వార్తను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఇదంతా పచ్చి అబద్ధమని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి ఏ పథకాన్ని ప్రకటించలేదని స్పష్టం చేసింది.
ఈ వైరల్ మెసేజ్ కింద రిజిస్టర్ నౌ లేదా సపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అంటూ ఒక లింక్ కూడా ఇస్తున్నారు. అసలు ప్రమాదం ఇక్కడే పొంచి ఉంది. ఇలాంటి లింక్‌లు క్లిక్ చేస్తే మీరు ఫిషింగ్ అనే సైబర్ క్రైమ్ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే మీ పేరు, ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతారు. మీరు ఆ వివరాలు ఇస్తే చాలు, మీ అకౌంట్లో ఉన్న డబ్బును సైబర్ నేరగాళ్లు క్షణాల్లో మాయం చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి అనుమానాస్పద లింక్‌ల ద్వారా డబ్బులు పంచదని గ్రహించాలి.
ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఏదైనా పథకం గురించి సమాచారం కావాలంటే నేరుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లకు వెళ్లి చూసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల వ్యక్తిగత సమాచారంతో పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా పోయే అవకాశం ఉంది. ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని ఇతరులకు పంపకుండా సైబర్ సెల్‌కు లేదా పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు రిపోర్ట్ చేయాలని అధికారులు కోరుతున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త కొత్త ఎత్తుగడలతో సామాన్యులను దోచుకుంటున్నారు. అందుకే తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ బ్యాంక్ ఓటిపి, సీవీవీ లేదా ఇతర రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ ఫోన్ లేదా అకౌంట్లకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల భద్రత పెరుగుతుంది. మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

