వైరల్ మెసేజ్ వెనుక ఉన్న అసలు నిజం ఇదే

Fact Check : ఇటీవల సోషల్ మీడియా, వాట్సాప్‌లలో ఒక మెసేజ్ వేగంగా వైరల్ అవుతోంది. ఫైనాన్స్ యాక్ట్ 2025 ద్వారా కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు (పెన్షనర్లు) ఇచ్చే అనేక ప్రయోజనాలను రద్దు చేసిందని, ముఖ్యంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెరుగుదల, భవిష్యత్తులో రాబోయే 8వ వేతన సంఘం సిఫార్సుల వంటి లాభాలు ఇకపై పెన్షనర్లకు దక్కవని ఆ మెసేజ్‌లో తప్పుడు ప్రచారం జరిగింది. లక్షలాది మంది పెన్షనర్లు ఈ నిర్ణయం వల్ల ప్రభావితమవుతారని ఆ మెసేజ్ పేర్కొనడంతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన మొదలైంది.

ఈ వైరల్ అవుతున్న సమాచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలన్నీ పూర్తిగా తప్పు, నిరాధారమైనవి అని స్పష్టం చేసింది. ఫైనాన్స్ యాక్ట్ 2025లో పెన్షనర్ల DA లేదా వేతన సంఘం ప్రయోజనాలను తొలగించే లేదా తగ్గించే ఉద్దేశంతో ఎటువంటి నిబంధన లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులకు గతంలో మాదిరిగానే DA పెంపుదల కొనసాగుతుందని, భవిష్యత్తులో ఏ కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చినా, దాని సిఫార్సులు కూడా పెన్షనర్లకు వర్తిస్తాయని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.

పెన్షనర్లలో ఈ గందరగోళం రావడానికి అసలు కారణం CCS (పెన్షన్) రూల్స్ 2021లోని రూల్ 37 లో చేసిన ఒక సవరణ. ఈ నిబంధన, ఏదైనా కారణాల వల్ల పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కు డిప్యూటేషన్‌పై వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిబంధన ప్రకారం అటువంటి ఉద్యోగులపై తీవ్రమైన దుష్ప్రవర్తన రుజువైతే, వారి రిటైర్మెంట్ ప్రయోజనాల్లో కొన్నింటిని జప్తు చేయవచ్చు. దీనికి సాధారణ పెన్షనర్లకు ఇచ్చే DA పెరుగుదల, 8వ వేతన సంఘం లేదా ఇతర ప్రయోజనాలకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి పెన్షనర్లు అపోహలకు గురికాకుండా, అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించబడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story