నకిలీ జీఎస్‌టీ బిల్లులతో కోట్లు కొల్లగొడుతున్న వైనం

Fake GST Number : మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వ్యాపారులు జీఎస్‌టీ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు. బిల్లుపై జీఎస్‌టీ నంబర్ ఉండటం వల్ల అది అధికారిక వ్యాపారం అని మనం నమ్ముతాం. కానీ చాలామంది వ్యాపారులు పాత నంబర్లను లేదా ఎవరో ఒకరి నంబర్లను బిల్లుపై ముద్రించి ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు కట్టే పన్ను ప్రభుత్వానికి చేరాలంటే, ఆ బిల్లు ఇచ్చే వ్యక్తి వద్ద నిజమైన జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ఉండాలి. మరి ఆ 15 అంకెల నంబర్ అసలుదో కాదో ఎలా తెలుసుకోవాలి?

ప్రతి జీఎస్‌టీ నంబర్‌లో 15 అంకెలు/అక్షరాలు ఉంటాయి. అందులో మొదటి రెండు అంకెలు ఆయా రాష్ట్రాల కోడ్‌ను సూచిస్తాయి. ఉదాహరణకు తెలంగాణకు 36, ఆంధ్రప్రదేశ్‌కు 37, కర్ణాటకకు 29 ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఉండే 10 అంకెలు సదరు వ్యాపారి లేదా సంస్థ పాన్ నంబర్. 13వ అంకె ఆ పాన్ కార్డ్ మీద ఆ రాష్ట్రంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయో చెబుతుంది. 14వ అక్షరం డీఫాల్ట్‌గా Z ఉంటుంది. చివరి అంకె చెక్ కోడ్ కోసం కేటాయిస్తారు. ఈ ఫార్మాట్‌లో లేకపోయినా లేదా రాష్ట్ర కోడ్ తప్పుగా ఉన్నా అది నకిలీ అని అనుమానించవచ్చు.

మీకు వచ్చిన బిల్లుపై అనుమానం ఉంటే వెంటనే మీ ఫోన్ తీసి ఇలా చేయండి:

* ముందుగా జీఎస్‌టీ అధికారిక పోర్టల్ www.gst.gov.in లోకి వెళ్లండి.

* అక్కడ పైన కనిపించే Services ట్యాబ్ క్లిక్ చేసి, అందులో Search Taxpayer ఆప్షన్ ఎంచుకోండి.

* ఇప్పుడు Search by GSTIN/UIN అనే బాక్స్‌లో బిల్లుపై ఉన్న 15 అంకెల నంబర్‌ను ఎంటర్ చేయండి.

* కింద కనిపించే కాప్చా కోడ్ టైప్ చేసి Submit నొక్కండి.

* వెంటనే ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉంది? ఆ షాపు ఎక్కడ ఉంది? అది ఇంకా యాక్టివ్‌గా ఉందా లేదా? అనే పూర్తి జాతకం బయటపడుతుంది. ఒకవేళ అక్కడ Invalid అని వస్తే అది పక్కా నకిలీ నంబర్ అని అర్థం.

నకిలీ అని తేలితే ఏం చేయాలి?

ఒకవేళ మీరు పట్టుకున్న నంబర్ నకిలీ అని తెలిస్తే, అక్కడ జీఎస్‌టీ చెల్లించవద్దు. అప్పటికే చెల్లించి ఉంటే, ఆ బిల్లు ఫోటో తీసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. జీఎస్‌టీ హెల్ప్‌డెస్క్‌కు helpdesk@gst.gov.in ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు మోసపోకుండా ఉండటమే కాకుండా, ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే వంచకులకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story