ఏడాదిలో గ్రూప్‌కు రూ. 7.18 లక్షల కోట్ల నష్టం

Ratan Tata : టాటా గ్రూప్‌కు మార్గదర్శకుడిగా ఉన్న దివంగత రతన్ టాటా మరణించి అక్టోబర్ 9, 2025 నాటికి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తైంది. దేశమంతా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్న ఈ సమయంలో టాటా కుటుంబంలో అంతర్గత కలహాలు రాజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రూప్‌లో కొత్త నాయకత్వం, బోర్డు సీట్ల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. రతన్ టాటా మరణం తర్వాత అక్టోబర్ 2024లో ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటాను టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆ తర్వాత నవంబర్ 2024లో నోయెల్‌ను టాటా సన్స్ బోర్డులో కూడా చేర్చారు. అయితే, ఈ నిర్ణయం ట్రస్ట్‌లోని సభ్యులందరి ఏకాభిప్రాయంతో జరగలేదని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే టాటా ట్రస్ట్స్‌లో బోర్డు సీటు కోసం రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం నోయెల్ టాటాకు మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం మెహ్లి మిస్త్రీకి మద్దతు పలుకుతోంది. మెహ్లి మిస్త్రీ టాటా సన్స్‌లో ఏకంగా 18.37% వాటాను కలిగి ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందినవారు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు పెరగడం గ్రూప్‌లో అస్థిరతకు దారితీస్తోంది. ఈ వివాదంపై చర్చించేందుకు అక్టోబర్ 7న సీనియర్ నాయకత్వం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వద్ద 45 నిమిషాల పాటు సమావేశం కావడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

టాటా గ్రూప్‌కు భారీ నష్టం

కుటుంబంలో నెలకొన్న ఈ వివాదాలు అనిశ్చితి కారణంగా టాటా గ్రూప్‌లోని కంపెనీల మార్కెట్ విలువ భారీగా తగ్గింది. గత ఏడాది (అక్టోబర్ 2024) 33.57 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న టాటా గ్రూప్‌కు చెందిన 23 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ, ఇప్పుడు 26.39 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే, కేవలం ఏడాది వ్యవధిలోనే గ్రూప్ మొత్తం రూ. 7.18 లక్షల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.

ఈ నష్టంలో అత్యధికంగా తేజస్ నెట్‌వర్క్స్ షేర్లు 50% వరకు పడిపోయాయి. ఆ తర్వాత ట్రెంట్లో 42.35%, టాటా టెక్నాలజీస్‌లో 32.55% తగ్గుదల కనిపించింది. గ్రూప్‌లోని అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్ లో 28.16%, టాటా ఎలెక్సీలో 26.42%, టాటా మోటార్స్‌లో 26.15% నష్టం నమోదైంది. ఈ అంతర్గత ఘర్షణపై రతన్ టాటా జీవిత చరిత్రను రాసిన థామస్ మాథ్యూ స్పందించారు. ట్రస్ట్ వ్యవస్థాపకుల లక్ష్యాలను కొనసాగించడానికి, ట్రస్ట్‌కు నాయకత్వం ఎప్పుడూ టాటా కుటుంబం చేతిలోనే ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story