Harsh Goenka: చైనాకు చెందిన పాంగ్ డాంగ్ లై అనే ప్రముఖ రీటైల్ సంస్థ తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ హ్యాపీ లీవ్ అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పాలసీ కింద ఉద్యోగులు ఏడాదికి 10 రోజుల పాటు అదనంగా వేతనంతో కూడిన సెలవులను తీసుకోవచ్చు. దీని కోసం ఉద్యోగులు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. మానసికంగా ఒత్తిడికి గురైనా లేదా మూడ్ బాగోకపోయినా ఈ సెలవులను వాడుకోవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే.. మేనేజర్లు లేదా పైఅధికారులు ఈ సెలవు అభ్యర్థనలను నిరాకరించే అధికారం కలిగి ఉండరు.

హర్ష్ గోయెంకా లేవనెత్తిన ప్రశ్న

భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఈ విధానంపై స్పందించారు. చైనా కంపెనీ అమలు చేస్తున్న ఈ విధానాన్ని ప్రస్తావిస్తూ.. "భారతీయ పని సంస్కృతిలో కూడా అన్ హ్యాపీ లీవ్ వంటి పాలసీల అవసరం ఉందా?" అని ప్రశ్నించారు. ఉద్యోగులలో అధిక పని ఒత్తిడి తగ్గించడానికి, వారు సంతోషంగా పనికి వచ్చేలా చేసేందుకు ఎలాంటి కార్పొరేట్ సంస్కృతిని ప్రోత్సహించాలో చర్చించాలని కోరారు. గోయెంకా పోస్ట్‌తో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

నెటిజన్లు, నిపుణుల భిన్నాభిప్రాయాలు

హర్ష్ గోయెంకా పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది ఉద్యోగులు వ్యక్తిగత లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇటువంటి బ్రేక్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు మాత్రం కేవలం 10 రోజుల సెలవులతో పని ప్రదేశంలో ఉన్న విషపూరితమైన సంస్కృతి లేదా మేనేజర్ల చెడు ప్రవర్తన మారదని, పని వేళలను క్రమబద్ధీకరించడం, ఆఫీస్ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడమే అసలైన పరిష్కారమని పేర్కొన్నారు.

చైనా కంపెనీ ఉద్యోగుల సంక్షేమ నిబంధనలు

పాంగ్ డాంగ్ లై కంపెనీ కేవలం 10 రోజుల అన్ హ్యాపీ లీవ్స్‌తోనే ఆగిపోలేదు. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు రోజుకు కేవలం 7 గంటల పని వేళలను మాత్రమే అమలు చేస్తోంది. వారానికి రెండు రోజులు శని, ఆదివారాలు వీకెండ్ సెలవులు ఇస్తుండగా, వీటికి అదనంగా ఏడాదికి 30 నుంచి 40 రోజుల సాధారణ సెలవులు, లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా మరో 5 రోజుల అదనపు సెలవులను అందిస్తోంది. ఉద్యోగి సంతోషంగా ఉంటేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందనే సూత్రాన్ని తమ సంస్థ పాటిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు యూ డాంగ్ లై స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story