Cooking Oil: దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి పెద్ద పండుగల సీజన్ రానే వచ్చింది. ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే, నిత్యావసరాల ధరలు మాత్రం సామాన్యుల ఉత్సాహంపై తీవ్రంగా నీళ్లు చల్లుతున్నాయి. ముఖ్యంగా వంటనూనెల రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో వంటింట్లో శబ్దాల కంటే సామాన్యుల గుండె చప్పుడు ఎక్కువవుతోంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించినప్పటికీ, మార్కెట్లో నూనె ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

సుంకాలు తగ్గించినా తగ్గని ధరలు

ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో వంటనూనెలపై 5 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్‌పై డ్యూటీని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించగా, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకాన్ని ఏకంగా సున్నా శాతానికి కుదించింది. రిఫైన్డ్ ఆయిల్‌పై కూడా డ్యూటీ తగ్గించి, ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని కంపెనీలను ఆదేశించింది. కానీ ఫలితం మాత్రం శూన్యంగా మారింది.

ఏడాది కాలంలో 25 శాతం భారం

గడచిన ఏడాది కాలంలో వంటనూనెల ధరలు 15 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే రిఫైన్డ్ ఆయిల్ 15 శాతం, పల్లి నూనె 14 శాతం మేర ప్రియమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, అంతర్జాతీయ మార్కెట్‌లో నూనె గింజల ధరలు పెరగడంతో భారతీయ మార్కెట్లలో రేట్లు దిగిరాలేదు. ప్రొడక్షన్ ఖర్చులు, గ్లోబల్ డిమాండ్ కలసి వినియోగదారులకు పండుగ ఊరట లేకుండా చేశాయి.

లీటర్ నూనె రూ.200 దాటి పరుగులు

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వంటనూనెల ధరలు లీటరుకు రూ.200 మార్కును దాటిపోయాయి. పల్లి నూనె లీటరు రూ.231 వద్ద లభిస్తుండగా, ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్) రూ.222, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.214 చొప్పున పలుకుతున్నాయి. అలాగే వనస్పతి రూ.184, సోయా ఆయిల్ రూ.180, పామ్ ఆయిల్ రూ.165 వద్ద విక్రయమవుతున్నాయి. పండుగ పిండివంటలు చేసుకోవాల్సిన సమయంలో ఈ రేట్లు చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

రూపాయి క్షీణత ఎఫెక్ట్

గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తొలి ఆరు నెలల్లోనే భారతదేశం నూనెల దిగుమతుల కోసం ఏకంగా రూ.87,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. గతేడాది ఇదే సమయానికి దిగుమతి బిల్లు రూ.73,000 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు సామాన్యులకు వంటనూనెల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు కనిపించడం లేదు.

Next Story