మండిపోతున్న డ్రై ఫ్రూట్స్, రాక్ సాల్డ్ ధరలు

Rock Salt : పండుగల సీజన్‌ వస్తుందంటేనే మనకు గుర్తొచ్చేది బట్టలు, పిండి వంటలు, పూజ సామాన్లు. కానీ ఈసారి వాటితో పాటు ఉప్పు, ఎండు ఫ్రూట్స్‌ ధరలు కూడా షాకిస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం రాకముందే, ఈ రెండింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మన దేశం ఎండు ఫ్రూట్స్‌, రాక్ సాల్ట్ కోసం ఎక్కువగా వేరే దేశాలపై ఆధారపడుతుంది కాబట్టే ఈ సమస్య వచ్చిందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. రాబోయే పండుగల రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత 15 రోజుల్లోనే వీటి ధరలు ఏకంగా 20-25 శాతం పెరిగిపోయాయి. దీనికి ముఖ్య కారణాలు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, ఇంకా పాకిస్తాన్‌తో మనకున్న అటారీ సరిహద్దు మూసేయడం.

పశ్చిమ ఆసియా( ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు) నుంచి వచ్చే బాదం, పిస్తా, కిస్మిస్, అంజీర్ లాంటి ఎండు ఫ్రూట్స్ మన దగ్గరికి సరిగా రావడం లేదు. అందుకే వాటి కొరత బాగా పెరిగింది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే పిస్తా, అంజీర్ ధరలు గత కొన్ని వారాల్లోనే కిలోకు రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లలో బాదం కిలో రూ.2000 నుంచి రూ.2400కి, ఇరాన్ పిస్తా రూ.1400 నుంచి రూ.1700కి చేరింది. దీనికి తోడు, భారత్-పాకిస్తాన్ మధ్య గొడవల వల్ల అటారీ సరిహద్దు మూసేయడంతో, ఆఫ్ఘనిస్తాన్ నుండి రావాల్సిన ఎండు ఫ్రూట్స్ కూడా ఆగిపోయాయి. అందుకే ఇంత ధర పెరిగింది.

మనం ఉపవాసాలు, పండుగలప్పుడు ఎక్కువగా వాడే రాక్ సాల్డ్ ధర కూడా చాలా వేగంగా పెరిగింది. ప్రయాగ్‌రాజ్ వంటి నగరాల్లో కిలో రాక్ సాల్డ్ ధర ఏకంగా రూ.60కి చేరింది. దీనికి కూడా ముఖ్య కారణం దిగుమతులు ఆగిపోవడం, ఇంకా మన దేశంలో దీనికి డిమాండ్ పెరగడం. ముఖ్యంగా శ్రావణ మాసం, నవరాత్రి లాంటి పండుగలప్పుడు రాక్ సాల్డ్ వాడకం చాలా పెరుగుతుంది. దీన్ని చూసి వ్యాపారులు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటున్నారు. అందుకే రేట్లు ఇంకా పెరిగిపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధాలు, ఉద్రిక్తతలు కొంచెం తగ్గితే, మరో నెల రోజుల్లో ఈ ధరలు తగ్గొచ్చని వ్యాపారులు ఆశ పడుతున్నారు. కానీ, అప్పటిదాకా సామాన్య ప్రజలు ఈ పెరిగిన ధరల భారాన్ని మోయాల్సిందే. అంతర్జాతీయ సమస్యలు, ఇంకా మన దేశంలో కొన్ని పంటల దిగుబడి తగ్గడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని. ఉదాహరణకు.. నాసిక్, కేరళలో కిస్మిస్ పంట సరిగా పండకపోవడం కూడా దీనికి ఒక కారణమట. మొత్తానికి, ఈ పరిస్థితి నవరాత్రి, శ్రావణ మాసం పండుగల ప్లానింగ్‌ను బాగా దెబ్బతీస్తుంది. జేబుకు చిల్లు పడటం ఖాయం!

PolitEnt Media

PolitEnt Media

Next Story