Cyber Attack: ఫుట్‌బాల్ ప్రపంచంలో కలకలం.. FIFA సర్వర్లపై భారీ సైబర్ దాడి
FIFA సర్వర్లపై భారీ సైబర్ దాడి

Cyber Attack: డిజిటల్ యుగంలో సైబర్ దాడుల ముప్పు రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న నిర్లక్ష్యం జరిగినా అత్యంత కీలకమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. తాజాగా ప్రపంచ అత్యున్నత ఫుట్‌బాల్ సంస్థ FIFA సైతం హ్యాకర్ల బారిన పడింది. సైబర్ నేరగాళ్లు ఫిఫా వెబ్సైట్ ద్వారా అంతర్గత నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి భారీ స్థాయిలో రహస్య డేటాను తస్కరించారు. ఈ డేటా చోరీ జరిగినట్లు స్వయంగా ఫిఫా ధృవీకరించింది. మరోవైపు హ్యాండ్సమ్ బాయ్ హ్యాకింగ్ క్లబ్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకుంది. తాము ఫిఫా సర్వర్ల నుంచి 12GB కంటే ఎక్కువ గోప్యమైన సమాచారాన్ని దొంగిలించినట్లు ఆ గ్రూప్ సంచలన ప్రకటన చేసింది.
లీక్ అయిన డేటాలో ఏముంది?
హ్యాకర్లు తమ వాదనకు బలం చేకూరుస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఫిఫాకు సంబంధించిన కొన్ని అంతర్గత ఫైళ్ల స్క్రీన్షాట్లను షేర్ చేశారు. తాము దొంగిలించిన డేటాలో సిబ్బంది గుర్తింపు కార్డులు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు, ఉన్నతాధికారుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక రికార్డులు, న్యాయపరమైన డాక్యుమెంట్లు ఉన్నాయని హ్యాకర్ల బృందం పేర్కొంది. అంతేకాకుండా ఫిఫా అంతర్గత కార్యకలాపాలు, పరిపాలనకు సంబంధించిన కీలక రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని హ్యాకర్లు చెబుతున్నారు. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఎంతమంది దీనివల్ల ప్రభావితమయ్యారు అనే వివరాలను ఫిఫా ఇంకా వెల్లడించలేదు.
ఫిఫా డేటా ఎలా హ్యాక్ అయింది?
ఫిఫా లాంటి దిగ్గజ సంస్థ భద్రతా వ్యవస్థను హ్యాకర్లు ఎలా ఛేదించారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నివేదికల ప్రకారం హ్యాకర్లు ఫిఫా సిస్టమ్‌లోని ఎలాంటి సాంకేతిక లోపాలను ఉపయోగించుకోలేదు. బదులుగా ఫిఫా ఉద్యోగుల గుర్తింపు వివరాలను దొంగిలించి, వారి పేరుతోనే సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యారు. అంటే ఉద్యోగుల మాదిరిగా నటిస్తూ సులభంగా సీక్రెట్ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే తమ వద్ద ఉన్న మొత్తం సమాచారంలో చోరీకి గురైన డేటా 0.1 శాతం కంటే తక్కువేనని, మూతపడిన ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్ప్రైజ్ పత్రాలు ఇందులో లేవని సంస్థ స్పష్టం చేసింది.
ఫుట్‌బాల్ బోర్డులకు తప్పని తిప్పలు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఫిఫా, వెంటనే చట్టపరమైన సంస్థలు, సైబర్ నిపుణులతో కలిసి విచారణ ప్రారంభించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బహిరంగపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనివల్ల ప్రభావితమైన వ్యక్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో ఫుట్‌బాల్ సంస్థలపై సైబర్ దాడులు పెరగడం గమనార్హం. నవంబర్ ప్రారంభంలో స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లిగా' డిజిటల్ ప్లాట్ఫామ్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడగా, జులైలో అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ సైతం ఈమెయిల్ లీక్ ఘటనపై విచారణ చేపట్టింది.

