FIFA World Cup 2026 : భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాలకు బ్రేక్? టీవీల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడలేమా?
టీవీల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడలేమా?

FIFA World Cup 2026 : ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026కు సమయం దగ్గరపడుతోంది. అయితే, భారతీయ ఫుట్‌బాల్ ప్రేమికులకు మాత్రం ఒక చేదు వార్త వినిపిస్తోంది. ఈ మెగా టోర్నీని భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసే విషయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. బ్రాడ్‌కాస్ట్ డీల్ (టెలికాస్ట్ హక్కులు) విషయంలో ఫిఫాకు, భారతీయ ప్రసార సంస్థలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. రిపోర్టుల ప్రకారం.. ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసార హక్కుల కోసం జియో హాట్‌స్టార్ దాదాపు 20 మిలియన్ డాలర్లను ఆఫర్ చేసింది. కానీ, ఫిఫా మాత్రం ఏకంగా 100 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంకెల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో చర్చలు నిలిచిపోయాయి. గతంలో 2022 కతర్ వరల్డ్ కప్ హక్కులను జియో సినిమా సుమారు 60 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఆశిస్తున్న ఫిఫాకు నిరాశ ఎదురవుతోంది. సోనీ వంటి ఇతర సంస్థలు కూడా చర్చల్లో పాల్గొన్నప్పటికీ, భారీ ధర కారణంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో డీల్ ఎందుకు కష్టమవుతోంది?
భారతీయ కంపెనీలు ఇంత పెద్ద మొత్తం పెట్టడానికి వెనకాడటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఈసారి వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోలలో జరగనుంది. దీనివల్ల టైమ్ జోన్ సమస్య తలెత్తుతుంది. మ్యాచ్‌లు భారత్‌లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ప్రసారమవుతాయి. ఆ సమయంలో చూసే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటంతో అడ్వర్టైజింగ్ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదని కంపెనీలు భావిస్తున్నాయి. అదనంగా భారత్‌లో ఫుట్‌బాల్‌కు క్రేజ్ పెరుగుతున్నా, క్రికెట్ స్థాయి ఆదాయాన్ని ఇది ఇంకా అందుకోలేదు.
చైనాలోనూ ఇదే పరిస్థితి
కేవలం భారత్ మాత్రమే కాదు, చైనాలో కూడా బ్రాడ్‌కాస్ట్ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. సాధారణంగా చైనాకు చెందిన సిసిటివి ముందే హక్కులను కొనుగోలు చేస్తుంది, కానీ ఈసారి అక్కడ కూడా చర్చలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 175 దేశాల్లో ప్రసార ఒప్పందాలు పూర్తయ్యాయి. కానీ ఆసియాలోని అతిపెద్ద మార్కెట్లు అయిన భారత్, చైనాలలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ముందున్న మార్గం ఏమిటి?
ఫిఫా వరల్డ్ కప్ జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా కొంత సమయం ఉండటంతో ఫిఫా తన ధరను తగ్గించుకోవడమో లేదా భారతీయ సంస్థలు తమ ఆఫర్‌ను పెంచడమో జరిగితేనే భారతీయులు టీవీల్లో మ్యాచ్‌లు చూడగలరు. చర్చలు ఇంకా జరుగుతున్నాయని, త్వరలోనే ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఫిఫా ప్రతినిధులు చెబుతున్నారు. ఒకవేళ ఏ సంస్థా ముందుకు రాకపోతే, ఫిఫా తన స్వంత ప్లాట్‌ఫారమ్ ఫిఫా ప్లస్ ద్వారా నేరుగా ప్రసారం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.

