FIFA World Cup 2026 : అమెరికా, మెక్సికో, కెనడా దేశాల వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కేవలం ఆటలోని థ్రిల్‌తోనే కాకుండా, మైదానంలో మెరుస్తున్న ఆటగాళ్ల అపారమైన సంపదతోనూ వార్తల్లో నిలుస్తోంది. నేటి కాలంలో టాప్ ఫుట్‌బాల్ స్టార్స్ కేవలం క్లబ్ శాలరీల పైనే ఆధారపడటం లేదు. అంతర్జాతీయ బ్రాండ్ల ప్రకటనలు, సొంత వ్యాపార సామ్రాజ్యాలు, భారీ పెట్టుబడుల ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది వరల్డ్ కప్‌లో ఆడుతున్న ప్రపంచంలోని అత్యంత సంపన్న ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఆస్తుల వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హాట్ టాపిక్‌గా మారాయి.

రొనాల్డో, మెస్సీల ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఫుట్‌బాలర్‌గా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో మొత్తం ఆస్తి విలువ సుమారు 1.2 నుంచి 1.4 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.లక్ష కోట్లకు పైమాటే)గా అంచనా వేశారు. నైకీ బ్రాండ్‌తో లైఫ్‌టైమ్ డీల్, గ్లోబల్ హోటల్ చైన్స్, జిమ్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అతనికి ఈ స్థాయి సంపదను తెచ్చిపెట్టాయి. మరోవైపు, అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలిపిన లియోనెల్ మెస్సీ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇంటర్ మియామి క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ నికర ఆస్తి విలువ 850 మిలియన్ డాలర్లుగా ఉంది. అడిడాస్ పార్ట్‌నర్‌షిప్‌తో పాటు హోటల్ రంగంలో మెస్సీకి భారీ పెట్టుబడులు ఉన్నాయి.

అరేబియా క్లబ్బులతో మారిన జాతకం

బ్రెజిల్ ఫార్వర్డ్ ప్లేయర్ నేమార్ సైతం భారీ సంపాదనతో టాప్ లిస్టులో ఉన్నాడు. సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్ హిలాల్‎తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అతని ఆస్తులు మరింత పెరిగాయి. ప్రస్తుతం నేమార్ నెట్ వర్త్ 450 నుంచి 500 మిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్యూమా, రెడ్ బుల్, గేమింగ్ కంపెనీల యాడ్స్ ద్వారా అతను భారీగా ఆర్జిస్తున్నాడు. ఇక ఫ్రాన్స్ యువ సంచలనం కిలియన్ ఎంబప్పే రియల్ మాడ్రిడ్ క్లబ్‌లో చేరిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. వేర్వేరు అంచనాల ప్రకారం ఎంబప్పే ఆస్తి విలువ 250 నుంచి 700 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. భారీ క్లబ్ శాలరీ, సైనింగ్ బోనస్, నైకీ, హబ్లో వంటి బ్రాండ్స్ అతనికి ఈ గుర్తింపు తెచ్చాయి.

మహమ్మద్ సలాహ్ నుంచి హాలాండ్ వరకు

ఈ ధనవంతుల జాబితాలో ఈజిప్ట్ స్టార్ మహమ్మద్ సలాహ్, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ చెరో 140 మిలియన్ డాలర్ల ఆస్తులతో నిలిచారు. లివర్‌పూల్ స్టార్ అయిన సలాహ్ ఆఫ్రికా ఖండంలోనే అత్యంత సంపన్న ప్లేయర్‌గా గుర్తింపు పొందగా, బేయర్న్ మ్యూనిచ్ తరఫున ఆడుతున్న హ్యారీ కేన్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. మాంచెస్టర్ సిటీ ప్లేయర్ కెవిన్ డి బ్రూయిన్ 130 మిలియన్ డాలర్లు, అదే క్లబ్ యువ సంచలనం ఎర్లింగ్ హాలాండ్ 100 మిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉన్నారు. వీరితో పాటు ఆసియా స్పోర్టింగ్ ఐకాన్ సన్ హ్యుంగ్-మిన్ (100 మిలియన్ డాలర్లు), సాడియో మానే (100 మిలియన్ డాలర్లు), వినిసియస్ జూనియర్ (80 మిలియన్ డాలర్లు), లూకా మోడ్రిచ్ (75 మిలియన్ డాలర్లు) ఆస్తులతో ఈ అత్యంత ధనవంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్ల క్లబ్‌లో కొనసాగుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story