Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ పూర్వపు కళ వచ్చింది. గత కొన్ని నెలలుగా మన మార్కెట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ, వెనకడుగు వేసిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) ఇప్పుడు ఒక్కసారిగా తమ రూట్ మార్చారు. భారతీయ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్నారు. కేవలం ఒకే ఒక్క వారంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లోకి 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్లకు పైగా) భారీ పెట్టుబడులను కుమ్మరించారు. బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జూన్ 2025 తర్వాత ఒకే వారంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో భారీగా షేర్లను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఈ పరిణామం సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటనిస్తోంది. ఎందుకంటే విదేశీ డబ్బు మార్కెట్లోకి వస్తే రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు కూడా లాభాల బాట పడతాయి.

విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు

భారత మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం అనేది కేవలం ఒక రోజుతో ముగిసిపోయే ట్రెండ్ లాగా కనిపించడం లేదు. జూలై 9వ తేదీతో ముగిసిన కేవలం నాలుగు రోజుల్లోనే అంతర్జాతీయ ఫండ్స్ మన మార్కెట్ నుంచి 1.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. దీనికి తోడు శుక్రవారం వచ్చిన ప్రాథమిక గణాంకాల ప్రకారం.. విదేశీ ఇన్వెస్టర్లు మరో 272 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అదనంగా కొన్నారు. వరుసగా నాలుగో వారం కూడా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో నెట్ బయ్యర్స్ గా నిలవడం విశేషం. సాధారణ ప్రజల కోణంలో చూస్తే.. మార్కెట్లోకి ఈ స్థాయిలో భారీగా నిధులు రావడం వల్ల కంపెనీల షేర్లకు బలమైన మద్దతు లభిస్తుంది. తద్వారా సామాన్యులు దాచుకున్న పొదుపు మొత్తాలు, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ బాగా పుంజుకుంటాయి.

భారత్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?

ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ వ్యూహకర్తలు విడుదల చేసిన నివేదికలో ఈ భారీ పెట్టుబడులకు గల బలమైన కారణాలను విశ్లేషించారు. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు వచ్చాయని వారు స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్లో కమోడిటీల ధరలు తగ్గడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతుండటం విదేశీయులకు కలిసి వచ్చింది. దీనితో పాటు దేశీయంగా జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండటం, రాబోయే త్రైమాసికాల్లో భారతీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. మరో ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్ కూడా స్పందిస్తూ.. భారత మార్కెట్లో రిస్క్ కంటే లాభాలు వచ్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని సానుకూల వ్యాఖ్యలు చేసింది.

ఏప్రిల్ పతనం నుంచి కోలుకున్న నిఫ్టీ

విదేశీ నిధుల రాకతో భారతీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుల్ రన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గతేడాది కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన నిఫ్టీ 50 ఇండెక్స్.. అక్కడి నుండి అద్భుతంగా కోలుకుని ఏకంగా 8 శాతం వరకు లాభపడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి స్థిరపడటం వంటి అంశాలు భారతీయ కార్పొరేట్ రంగ లాభాల మార్జిన్‌ను పెంచుతున్నాయి. కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పుడు, ఆ కంపెనీల షేర్లు కొన్న సాధారణ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ కూడా దానంతట అదే పెరుగుతుంది.

కొద్దిగా అప్రమత్తత కూడా అవసరమే

గత నాలుగు వారాలుగా విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, నాణేనికి ఉన్న మరో వైపును కూడా మనం గమనించాలి. ఈ ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ దాదాపు 27 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. అంటే మార్కెట్లోకి విదేశీ నిధులు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. గతంలో వారు మార్కెట్ నుంచి తరలించిన భారీ నిధులతో పోలిస్తే ఇది తక్కువే. కాబట్టి మార్కెట్ మరింత స్థిరపడటానికి, దీర్ఘకాలికంగా బలమైన ర్యాలీని కొనసాగించడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story