కాంగ్రెస్​కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షాక్!

GST : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన జీఎస్టీ విధానంపై కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రకటనలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం మొదట జీఎస్టీని అమలు చేసినప్పుడు, ఇదే ప్రతిపక్షాలు దానిని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఎగతాళి చేశాయి. ఇప్పుడు జీఎస్టీలో చేసిన మార్పులకు తామే కారణమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆమె విమర్శించారు. గతంలోనే రాహుల్ గాంధీ జీఎస్టీలో మార్పులకు సూచనలు ఇచ్చారు. కానీ, గత 9 ఏళ్లుగా ప్రభుత్వం ఆ సూచనలను పట్టించుకోలేదని, ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు దొంగల ఉద్యమం ప్రారంభించగానే ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంపై నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జీఎస్టీని విమర్శించే వారికి నిర్మలా సీతారామన్ తెలుసుకొని మాట్లాడాలని సలహా ఇచ్చారు. నిజానికి, భారత్ 1960లలోనే జీఎస్టీని అమలు చేయగలిగేది. కానీ, రాజకీయ విభేదాల వల్ల ఈ మార్పు సాధ్యం కాలేదని ఆర్థిక మంత్రి ఇండియా టుడే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా?

నూతన జీఎస్టీ విధానం అమలులోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల ఆదాయం తగ్గుతుందనే భయాలపై నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. జీఎస్టీలో పన్నులు తగ్గించడం వల్ల రాష్ట్రాలకు మాత్రమే కాదు, కేంద్రానికి కూడా నష్టం ఉంటుంది. కేంద్రం రాష్ట్రాలకు దానం ఇవ్వడం లేదు. జీఎస్టీని అమలు చేయాలంటే కేంద్రం, రాష్ట్రాలు కొన్ని పన్నులను వదులుకున్నాయని ఆమె వివరించారు.

ఆదాయం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం

కేంద్రానికైనా, రాష్ట్రాలకైనా ఎప్పుడూ ప్రజల సంక్షేమమే మొదటి ప్రాధాన్యత కావాలి. ఆదాయం ఎక్కడ నుంచి తీసుకురావాలనేది తర్వాత ఆలోచించవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని ఆమె దీనికి ఉదాహరణగా చెప్పారు. 'ఆ సమయంలో కూడా ప్రధాని మోడీ ఏ మాత్రం భయపడలేదు. ఆదాయం గురించి ఇప్పుడు ఆలోచించవద్దు, ప్రజలకు ఉచితంగా టీకాలు ఇవ్వడమే మన లక్ష్యం కావాలని ఆయన చెప్పారు' అని నిర్మలా సీతారామన్ గుర్తు చేసుకున్నారు.

పెట్రోల్, డీజిల్​పై జీఎస్టీ ఉండదు..

మద్యం లాగే, పెట్రోల్, డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి రావు అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ వద్ద ఎటువంటి ప్రతిపాదన లేదు. ఇది రాష్ట్రాల నిర్ణయానికి వదిలిపెట్టామని ఆమె పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story