Fixed Deposit Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే
ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే

Fixed Deposit Rates : భారతీయ పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పటికీ అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్‌గా ఉన్నాయి. మీ డబ్బుకు భద్రతతో పాటు స్థిరమైన వడ్డీ రాబడి కావాలనుకునేవారికి ఎఫ్‌డీలు మంచి అవకాశం. అయితే, ఎఫ్‌డీలలో డబ్బు పెట్టే ముందు ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవలే పలు బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. ప్రస్తుతం ఒక సంవత్సరం ఎఫ్‌డీలపై ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న తాజా వడ్డీ రేట్లు, ఏ బ్యాంకులో ఎక్కువ రాబడి లభిస్తుందో వివరంగా చూద్దాం.
ప్రస్తుతం దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 6.40% వడ్డీతో కొంచెం ఎక్కువగా ఉంది. సీనియర్ సిటిజన్లకు దాదాపు అన్ని బ్యాంకులు సాధారణ పౌరుల కంటే 0.50 శాతం అదనపు వడ్డీని అందిస్తాయి. అయితే, కొన్ని బ్యాంకులు నిర్దిష్ట కాలవ్యవధిపై 7% కంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 390 రోజుల ఎఫ్‌డీ పై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.10% వడ్డీని అందిస్తోంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ కూడా రెండు లేదా మూడు సంవత్సరాల ఎఫ్‌డీలకు 7.10% వరకు వడ్డీని పెంచుతున్నాయి. కెనరా బ్యాంక్ పాపులర్ 444 రోజుల ఎఫ్‌డీ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు 7% గరిష్ట రాబడిని ఇస్తోంది. ఫెడరల్ బ్యాంక్ 999 రోజుల ఎఫ్‌డీపై 6.70% వరకు అధిక రాబడిని ఇస్తోంది.
మీ పెట్టుబడిని ఎక్కువ కాలం ఉంచాలనుకుంటే చాలా బ్యాంకులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలవ్యవధికి మరింత మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధికి ఎఫ్‌డీలు చేస్తే సాధారణ పౌరులకు 6.60%, సీనియర్ సిటిజన్లకు 7.10% వరకు వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలవ్యవధికి సాధారణ పౌరులకు 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% వరకు రాబడి లభిస్తుంది. కోటక్ బ్యాంక్ 391 రోజుల నుంచి 23 నెలల మధ్య కాలవ్యవధిపై అత్యధిక వడ్డీని అందిస్తోంది.
కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా, ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిగత ఆర్థిక అవసరాలను కూడా పరిగణించాలి. మీకు ఎంత కాలం డబ్బు అవసరం లేదు, అత్యవసరంగా డబ్బు అవసరమైతే (లిక్విడిటీ) ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలుసుకోవాలి. మీరు ఏ పన్ను స్లాబ్‌లో ఉన్నారో తెలుసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. చాలా బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా ఎఫ్‌డీ చేసేవారికి లేదా తమ పాత కస్టమర్‌లకు అదనంగా 0.10% వరకు వడ్డీని పెంచే అవకాశం కూడా ఇస్తున్నాయి.

