భారీ నష్టాల్లో కంపెనీ

Flipkart : దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాల్‌మార్ట్‌కు చెందిన ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరం 2024-25 నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ.5,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ టాఫ్లర్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దీని నష్టాలు పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఫ్లిప్‌కార్ట్ ఇండియా నష్టం రూ.4,248.3 కోట్లు.

ఆదాయం పెరిగినా.. నష్టం తప్పలేదు!

ఆర్థిక సంవత్సరం 2024-25లో ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో 17.3 శాతం వృద్ధి నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70,541.9 కోట్ల రూపాయల నుండి 82,787.3 కోట్ల రూపాయలకు పెరిగింది. టాఫ్లర్ నుండి అందిన గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం వ్యయం 17.4 శాతం పెరిగి 88,121.4 కోట్ల రూపాయలకు చేరింది. కంపెనీ ఆర్థిక వ్యయాలు కూడా 2024-25లో 57 శాతం పెరిగి సుమారు 454 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. కంపెనీ ఆదాయం పెరిగినా, నష్టం కూడా పెరిగింది కాబట్టి దాని వల్ల కంపెనీకి పెద్దగా ఊరట లభించలేదు.

ఫ్లిప్‌కార్ట్​ ఏం చెబుతోంది?

ఈ గణాంకాల గురించి అధికారికంగా సమాధానం కోరినప్పుడు, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ-కామర్స్‌లో తీవ్రమైన పోటీ, డిస్కౌంట్ మోడల్ కోసం నిరంతర వ్యయం కారణంగా ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పడిందని నిపుణులు చెబుతున్నారు. అయినా, పెరుగుతున్న ఆదాయం కంపెనీ అమ్మకాలు, మార్కెట్ విస్తృతిలో నిరంతర వృద్ధిని చూపిస్తోంది.

మింత్రాకు లాభాలు

మరోవైపు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లాభాలు అనేక రెట్లు పెరిగి 548.3 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. టాఫ్లర్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ 30.9 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5,121.8 కోట్ల రూపాయల నుండి 18 శాతం పెరిగి 2024-25లో 6,042.7 కోట్ల రూపాయలకు చేరుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story