Foreign Investors : విదేశీ ఇన్వెస్టర్లకు కేంద్రం బంపర్ ఆఫర్.. భారీగా మారనున్న టాక్స్ రూల్స్
భారీగా మారనున్న టాక్స్ రూల్స్

Foreign Investors : భారతీయ స్టాక్ మార్కెట్, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశీయ మార్కెట్ నుండి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులను మళ్లీ వెనక్కి రప్పించేందుకు పన్ను నిబంధనలను సరళతరం చేయాలని మోదీ సర్కార్ గట్టిగా ఆలోచిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కొన్ని నిర్దిష్ట సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు పన్నుల పరంగా పెద్ద ఊరట కల్పించేలా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ సిఫార్సు చేసినట్లు సమాచారం.
భారీగా తరలిపోయిన విదేశీ పెట్టుబడులు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ సుమారు 6 శాతం వరకు బలహీనపడింది. దీనికి తోడు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ ఏడాది జనవరి నెల నుండి ఇప్పటివరకు భారతీయ షేర్ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. విదేశీ నిధులు ఈ స్థాయిలో తరలిపోవడం వల్లే రూపాయి విలువపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేయడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ప్రభుత్వ బాండ్లపై పన్ను మినహాయింపు
మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడులను పెంచడానికి, రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఉమ్మడిగా పని చేస్తున్నాయి. ఇందులో భాగంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత ప్రభుత్వ బాండ్లలో (G-Secs) పెట్టే పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వడ్డీ ఆదాయంపై విదేశీ ఇన్వెస్టర్లు 20 శాతం విత్‌హోల్డింగ్ టాక్స్ చెల్లిస్తున్నారు. గతంలో ఇది కేవలం 5 శాతంగానే ఉండేది, కానీ దానిని 20 శాతానికి పెంచడం వల్ల ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు. ఇప్పుడు ఇందులో మళ్లీ రాయితీలు ఇస్తే బాండ్లలో డాలర్ల పెట్టుబడులు భారీగా పెరుగుతాయి.
ఆర్బీఐ మానిటరీ పాలసీపైనే అందరి కళ్లు
త్వరలోనే జరగబోయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం తర్వాత కూడా ఈ పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తీసుకురాబోయే ఈ కొత్త ఆర్డినెన్స్ కనుక అమలులోకి వస్తే, అది విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ లోకి తిరిగి రావడానికి, స్టాక్ మార్కెట్ లో మళ్లీ స్థిరత్వం ఏర్పడటానికి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ సమీక్షకు డిమాండ్
రాబోయే బడ్జెట్‌కు ముందే విదేశీ ఇన్వెస్టర్లు భారత ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ నిబంధనలను పునఃసమీక్షించాలని వారు కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా పన్ను భారం పెరగడం వల్లే భారతదేశం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మునుపటిలా ఆకర్షణీయంగా కనిపించడం లేదని పన్ను నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గిస్తే విదేశీ నిధుల వరద మళ్లీ మొదలవుతుంది.

