విదేశీ విద్య, వైద్యం కోసం పంపే డబ్బుపై తగ్గిన పన్ను భారం

Budget 2026 : బడ్జెట్ 2026 విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు భారీ ఊరటనిచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ పద్దులో సోర్స్ టాక్స్ కలెక్షన్ రేట్లను భారీగా తగ్గిస్తూ కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా విదేశీ టూర్ ప్యాకేజీలు, విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులపై పన్ను భారం తగ్గడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27లో విదేశాలకు నిధులు పంపే వారి కోసం కీలక ప్రకటనలు చేశారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశీ విద్య, వైద్య అవసరాల కోసం పంపే నిధులపై టీసీఎస్ రేటును ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. అంటే, రూ.10 లక్షల కంటే ఎక్కువ నిధులు పంపే కుటుంబాలకు ఇకపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రతి ఏడాది ఒక వ్యక్తి గరిష్టంగా 2,50,000 డాలర్ల వరకు విదేశాలకు పంపే వెసులుబాటు ఉండగా, ఈ కొత్త రేట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిస్తాయి.

విదేశీ ప్రయాణాల విషయంలో ప్రభుత్వం ఇంకాస్త ఉదారంగా వ్యవహరించింది. ఇప్పటి వరకు విదేశీ టూర్ ప్యాకేజీలపై రూ.7 లక్షల పరిమితి దాటితే 20 శాతం వరకు టీసీఎస్ వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిమితితో సంబంధం లేకుండా అన్ని రకాల విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును కేవలం 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీనివల్ల విదేశాలకు వెళ్లే పర్యాటకులకు ప్యాకేజీ ధరలు భారీగా తగ్గుతాయి. అయితే, విద్య మరియు వైద్యం మినహా ఇతర వ్యక్తిగత కారణాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై మాత్రం పాత 20 శాతం పన్ను రేటు అలాగే కొనసాగుతుంది.

అంతేకాకుండా, వ్యాపార వర్గాల కోసం కొన్ని రకాల వస్తువుల విక్రయాలపై కూడా పన్ను రేట్లను సవరించారు. మద్యం, స్క్రాప్ (కబాడ్), ఖనిజాల విక్రయాలపై టీసీఎస్ రేటును 2 శాతానికి సర్దుబాటు చేశారు. అలాగే టెండూ ఆకులపై పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా, ఎన్నారైలకు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి మరింత స్వేచ్ఛను కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు. గత బడ్జెట్‌లో రెండు ఇళ్లను స్వంత అవసరాల కోసం వాడుకుంటున్నట్లు చూపించుకునే వెసులుబాటు కల్పించగా, ఈసారి విదేశీ ఖర్చులపై పన్ను తగ్గింపుతో సామాన్యుడికి చేరువయ్యే ప్రయత్నం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story