Forex Reserves : బడ్జెట్‌కు ముందు బంపర్ న్యూస్..కళకళలాడుతున్న భారత్ ఖజానా
కళకళలాడుతున్న భారత్ ఖజానా

Forex Reserves : ఫిబ్రవరి 1, 2026 ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక అదిరిపోయే తీపి కబురు అందింది. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా పెరిగి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. బడ్జెట్‌కు ముందు దేశ ఖజానా ఇలా కళకళలాడటం ఆర్థికంగా శుభపరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జనవరి 23తో ముగిసిన వారానికి భారత్ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు ఏకంగా 709.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
భారత విదేశీ మారక నిల్వలు కేవలం ఒక్క వారంలోనే సుమారు 8 బిలియన్ డాలర్ల మేర పెరగడం విశేషం. గడిచిన రెండు వారాలుగా ఈ నిల్వలు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, ఆర్‌బీఐ చేపట్టిన ఫారెక్స్ స్వాప్ చర్యలేనని తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశం వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ 123 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో ఒక్క వారంలోనే 5.6 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదైంది. అంటే మనం కొన్న బంగారం విలువ పెరగడం వల్ల దేశ సంపద కూడా అమాంతం పెరిగింది.
ప్రస్తుతం రూపాయి విలువ అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోతోంది. దీన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న డాలర్లను మార్కెట్లో విక్రయిస్తూ రూపాయి పతనాన్ని అడ్డుకుంటోంది. సాధారణంగా డాలర్లను అమ్మితే మన నిల్వలు తగ్గాలి, కానీ బంగారం విలువ పెరగడం, విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ పెరగడం వల్ల మన ఫారెక్స్ నిల్వలు తగ్గకపోగా మరింత పెరిగాయి. దేశీయ మార్కెట్లో స్థిరత్వం కాపాడటమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
భారత్ తన వద్ద ఉన్న నిల్వలలో కేవలం విదేశీ కరెన్సీపైనే కాకుండా, బంగారంపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతోంది. రిస్క్ తగ్గించుకోవడానికి గోల్డ్ రిజర్వ్స్‌ను పెంచుకుంటూ పోతోంది. అయితే ఇదే సమయంలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, మొత్తం ఫారెక్స్ నిల్వలు 700 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఉండటం వల్ల, ఎదైనా ఆర్థిక సంక్షోభం ఎదురైనా తట్టుకోగలిగే శక్తి భారత్‌కు ఉందని అర్థమవుతోంది.
బడ్జెట్ ప్రసంగం సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ గణాంకాలను ప్రస్తావించే అవకాశం ఉంది. దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని చెప్పడానికి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఒక నిదర్శనం. విదేశీ పెట్టుబడులు రావడం, ఎగుమతులు మెరుగుపడటం వంటి అంశాలు కూడా ఈ నిల్వలు పెరగడానికి దోహదపడ్డాయి. రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత స్థిరపడితే, భారత్ మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

