Retirement Plan : పాత కాలపు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇక వేస్ట్.. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు మీ ఇన్వెస్ట్‌మెంట్ మార్చకపోతే నష్టమే
ఇన్వెస్ట్‌మెంట్ మార్చకపోతే నష్టమే

Retirement Plan : దాదాపు పదేళ్ల క్రితం వరకు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే 60 ఏళ్ల వయసు తర్వాత అవసరాల కోసం కొంత డబ్బును పొదుపు ఖాతాలో దాచుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడు కాలం వేగంగా మారిపోయింది. మారుతున్న జీవనశైలి, సుదీర్ఘ ఆయుష్షు, ఉద్యోగాల మార్పుల వల్ల రిటైర్మెంట్ ఆలోచనల సరళి కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కొందరు 45 ఏళ్లకే ఉద్యోగానికి స్వస్తి చెప్పి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే.. మరికొందరు 60 ఏళ్లు దాటినా ఏదో ఒక రూపంలో సంపాదన కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకే ఆర్థిక నిపుణులు ఇప్పుడు రిటైర్మెంట్‌ను ఒక కొత్త కోణంలో చూస్తున్నారు. నేటి కాలంలో కేవలం డబ్బు దాచడమే కాకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, హెల్త్‌కేర్ ఖర్చులను తట్టుకునేలా సరికొత్త ఫార్ములాలను సూచిస్తున్నారు.
60 ఏళ్లు దాటినా ఆగని సంపాదన
ఈ రోజుల్లో ఉద్యోగం నుంచి తప్పుకున్న ప్రతి ఒక్కరూ ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. చాలా మంది రిటైర్మెంట్ తర్వాత కన్సల్టింగ్, పార్ట్ టైమ్ జాబ్స్ లేదా ఫ్రీలాన్స్ పనులు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి వారికి రిటైర్మెంట్ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం వస్తుంది కాబట్టి, వారు పూర్తిగా తమ పొదుపు నిధిపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కానీ, రిటైర్మెంట్ మొదటి రోజు నుంచే పని పూర్తిగా ఆపేయాలనుకునే వారికి మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఫండ్ అవసరమవుతుంది. అందువల్ల ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ అనేది మీ వయసును బట్టి కాకుండా, మీ భవిష్యత్తు జీవనశైలి డిమాండ్లను బట్టి డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది.
హెల్త్‌కేర్ ఖర్చులే అతిపెద్ద సవాలు
వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు ప్రస్తుతం మిడిల్ క్లాస్ వర్గాలకు పెద్ద సవాలుగా మారాయి. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే జీవితకాలం దాచుకున్న నిధి మొత్తం హాస్పిటల్ బిల్లులకే సరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వైద్య ఖర్చుల కోసం మొదటి నుంచే విడిగా ప్లాన్ చేసుకోవాలి. దీనితో పాటు నిత్యం పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరో ముప్పుగా పరిణమించింది. ఈ రోజు సరిపోతుందని భావించే రూ.50 లక్షల విలువ, మరో 20 ఏళ్ల తర్వాత చాలా తక్కువగా మారవచ్చు. అందుకే కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడకుండా, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఈక్విటీ (షేర్ మార్కెట్), మ్యూచువల్ ఫండ్స్ వంటి రంగాలలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెప్తున్నారు.
ఏడాదికి ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ రివ్యూ తప్పనిసరి
చిన్న వయసులో ఉన్నప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువ కాబట్టి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ వాటా ఎక్కువగా ఉంచుకోవచ్చు. వయసు పైబడుతున్న కొద్దీ ఆ నిధిని సురక్షితమైన డెట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ పథకాల వైపు క్రమంగా మళ్లించాలి. ఈ మార్పు రాత్రికి రాత్రి కాకుండా వ్యవస్థీకృతంగా జరగాలి. మన జీవితంలో ప్రాధాన్యతలు, జీతాలు మారుతున్నట్లే రిటైర్మెంట్ ప్లాన్‌ను కూడా ఏటా సమీక్షించుకోవాలి. జీతం పెరిగిన ప్రతిసారీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ, మారుతున్న ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్లాన్‌ను అప్‌డేట్ చేసుకునే వ్యూహమే మిమ్మల్ని వృద్ధాప్యంలో ఆర్థిక రారాజుగా నిలబెడుతుంది.

