ATM : బ్యాంకింగ్ రంగంలో కొత్త విప్లవం.. డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా
డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా

ATM : డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఇప్పుడు బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎప్పుడు డబ్బు కావాలన్నా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి విత్ డ్రా చేసుకుంటున్నాం. అయితే, కొన్నిసార్లు హడావుడిలో జేబులో డెబిట్ కార్డు పెట్టుకోవడం మర్చిపోతుంటాం. సరిగ్గా అదే సమయానికి చేతిలో నగదు లేక, కార్డు దొరకక టెన్షన్ పడుతుంటాం. కానీ ఇకపై అలాంటి చింత అక్కర్లేదు. మీ దగ్గర డెబిట్ కార్డు లేకపోయినా, కేవలం ఆధార్ కార్డు లేదా మీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. చిటికెలో నగదును చేతికి అందుకోవచ్చు.
ఆధార్ కార్డుతో నగదు విత్‌డ్రా.. ఇలా!
మీ దగ్గర ఏటీఎం కార్డు లేనప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AePS) మీకు ఆపద్బాంధవుడిలా పనిచేస్తుంది. దీని కోసం మీరు పెద్ద పెద్ద బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మీ వీధి చివర ఉండే మైక్రో ఏటీఎం సేవలు అందించే బ్యాంక్ మిత్ర లేదా బిజినెస్ కరస్పాండెంట్ ని సంప్రదిస్తే సరిపోతుంది. వీరు బ్యాంకుల ద్వారా గుర్తింపు పొందిన ఏజెంట్లు. వీరి దగ్గర ఉన్న చిన్న మిషన్ ద్వారా మీరు సులభంగా డబ్బులు తీసుకోవచ్చు.
మైక్రో ఏటీఎం ఎలా పనిచేస్తుంది?
ఈ ప్రక్రియ చాలా సులభం. ఏజెంట్ దగ్గర ఉన్న మైక్రో ఏటీఎం మిషన్‌లో నగదు ఉపసంహరణ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, మీ వేలిముద్రను స్కాన్ చేయాలి. మీ వేలిముద్రలు ఆధార్ డేటాతో సరిపోలగానే, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయి ఏజెంట్ మీకు నగదు ఇస్తారు. అయితే ఒక రోజులో ఎంత విత్ డ్రా చేయాలనేది మీ బ్యాంక్ లిమిట్ మీద ఆధారపడి ఉంటుంది. లావాదేవీ పూర్తయ్యాక ఏజెంట్ నుంచి రశీదు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి..
ఆధార్ మాత్రమే కాకుండా ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా ఏటీఎంల నుంచి నేరుగా నగదు తీసుకోవచ్చు. నేడు దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఏటీఎం మిషన్లలో QR Code Cash Withdrawal ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీని కోసం మీరు ఏటీఎం స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే మీ ఫోన్‌లోని గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం వంటి యాప్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేసి, మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి యూపీఐ పిన్ నొక్కితే చాలు.. ఏటీఎం మిషన్ నుంచి నోట్లు బయటకు వస్తాయి.

