తొమ్మిది నెలల్లో 30 వేల కొలువులు

Foxconn : బెంగళూరు నగరం సమీపంలోని దేవనహళ్లిలో యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ సృష్టించిన ఉపాధి సునామీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 30,000 మందికి ఉద్యోగాలు కల్పించి ఈ ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. తైవాన్‌కు చెందిన హాన్ హై ప్రిసిషన్ ఇండస్ట్రీ (ఫాక్స్‌కాన్) తన ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో చేపట్టిన ఈ భారీ రిక్రూట్‌మెంట్, భారత తయారీ రంగంలో ఒక సంచలనంగా మారింది.

ఈ ఫ్యాక్టరీ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇక్కడ మహిళా శక్తి రాజ్యమేలుతోంది. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ ప్లాంట్‌లో పనిచేస్తున్న వారిలో 80 శాతం మంది మహిళలే. అందులోనూ మెజారిటీ ఉద్యోగులు 19 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతులే కావడం విశేషం. చాలామందికి ఇదే మొదటి ఉద్యోగం. చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఉన్న అతిపెద్ద ఫ్యాక్టరీ ఇదే. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడళ్లతో ఇక్కడ ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభమవ్వగా, ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తయారీ కూడా ఇక్కడే జరుగుతోంది. ఇక్కడ తయారవుతున్న ఫోన్లలో మెజారిటీ భాగం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఫాక్స్‌కాన్ చేపట్టిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్‎లో భాగంగా ఈ యూనిట్‌ను నిర్మించారు. ప్రస్తుతానికి 30,000 మందికి ఉపాధి లభించినప్పటికీ, భవిష్యత్తులో ఈ సంఖ్యను 50,000 వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే ఆరు భారీ డార్మిటరీలను (వసతి గృహాలు) నిర్మించారు. మహిళా ఉద్యోగుల భద్రత మరియు సౌకర్యం కోసం ఇప్పటికే కొన్ని వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల మహిళలకు కూడా ఇక్కడ పెద్దపీట వేయనున్నారు.

ఈ ప్రాజెక్టును కేవలం ఫ్యాక్టరీలా కాకుండా ఒక సెల్ఫ్-కంటైన్డ్ టౌన్‌షిప్ లాగా తీర్చిదిద్దుతున్నారు. ప్లాంట్ లోపలే నివాస గృహాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు, పాఠశాలలు, వినోద కేంద్రాలు ఉండబోతున్నాయి. ఇక్కడ పనిచేసే వారికి నెలకు సుమారు రూ. 18,000 జీతంతో పాటు, ఉచిత వసతి, సబ్సిడీ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇది యువతులకు ఆర్థిక స్వతంత్రతను ఇవ్వడమే కాకుండా, వారి కుటుంబాలకు పెద్ద ఆసరాగా నిలుస్తోంది. మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఈ ప్లాంట్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story