Jio IPO: 104 మంది నుంచి 80 లక్షల ఇన్వెస్టర్లకు.. ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించిన జియో
సరికొత్త రికార్డు సృష్టించిన జియో

Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త రికార్డులను తిరగరాసింది. దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజే మైండ్ బ్లాకింగ్ ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఓకి ముందు కేవలం 104 మంది వాటాదారులు మాత్రమే ఉన్న ఈ కంపెనీ, లిస్టింగ్ పూర్తయ్యేసరికి ఏకంగా 79.6 లక్షల (7.96 మిలియన్లు) షేర్హోల్డర్లతో దేశంలోనే అత్యధిక ఇన్వెస్టర్లు కలిగిన నమోదిత సంస్థగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (66.3 లక్షలు), వొడాఫోన్ ఐడియా, మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజాలను దాటుకుని జియో నంబర్-1 స్థానంలో నిలిచింది.
బిగ్గెస్ట్ ఐపీఓ.. ఐతిహాసిక రెస్పాన్స్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకి భారతీయ ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఏకంగా 1.38 కోట్లకు పైగా అప్లికేషన్లు రావడంతో మొత్తం రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్ నమోదైంది. బుధవారం నాటి లిస్టింగ్‌లో ఇష్యూ ధర రూ.1,119 కంటే 21.36 శాతం లాభంతో రూ.1,358 వద్ద షేర్లు అరంగేట్రం చేశాయి. దీంతో తొలి రోజే కంపెనీ మార్కెట్ విలువ రూ.12.53 లక్షల కోట్లకు చేరి దేశంలోనే రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర రూ.1,417.35 వద్ద స్థిరపడింది.
రేసులో వెనుకబడిన ఇతర దిగ్గజాలు
వాటాదారుల సంఖ్య పరంగా ఎన్నో ఏళ్లుగా నంబర్-1 స్థానాల్లో కొనసాగుతున్న దిగ్గజ కంపెనీలన్నింటినీ జియో ఒకే దెబ్బకు అధిగమించింది. టాటా మోటార్స్ (66.3 లక్షలు), వొడాఫోన్ ఐడియా (57.9 లక్షలు), యెస్ బ్యాంక్ (57.6 లక్షలు), సుజ్లాన్ ఎనర్జీ (56 లక్షలు), టాటా స్టీల్ (51.4 లక్షలు) వంటి కంపెనీలు జియో కంటే చాలా వెనుకబడిపోయాయి. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (50.7 లక్షలు), ఐఆర్ఎఫ్సీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి భారీ నెట్వర్క్ ఉన్న సంస్థలను కూడా జియో దాటేసింది.
ఎల్ఐసీ, హ్యుందాయ్‌ల కంటే ఎన్నో రేట్లు ఎక్కువ
భారత మార్కెట్లో గతంలో వచ్చిన భారీ ఐపీఓలతో పోల్చి చూసినా జియో ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో భారీ సంచలనం సృష్టించిన ఎల్ఐసీ (21.7 లక్షల షేర్హోల్డర్లు), హ్యుందాయ్ మోటార్ ఇండియా (7.2 లక్షలు), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (22.4 లక్షలు), ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (8.2 లక్షలు) వంటి ఐపీఓలతో పోలిస్తే జియో షేర్‌హోల్డర్ల సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. లిస్టింగ్ వేడుకలో పాల్గొన్న జియో డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ జియో ఇప్పుడు భారత్‌లోని ప్రతి ఇంటితోనూ ముడిపడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు.
ధీరూభాయ్ అంబానీ వారసత్వం
భారతీయ కుటుంబాలకు ఈక్విటీ మార్కెట్లను చేరువ చేయాలనే ధీరూభాయ్ అంబానీ ఆశయానికి జియో లిస్టింగ్ మరో మలుపుగా మారింది. ప్రస్తుతం ఐపీఓ పూర్తయిన తర్వాత కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీలో 64.4 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉంది. గూగుల్, మెటా వంటి గ్లోబల్ దిగ్గజాలు కీలక ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులలో రూ.27,500 కోట్లను రికార్డు స్థాయిలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అప్పులను తీర్చడానికి వినియోగించనున్నారు.

