Fuel Oil Crisis : అట్టడుగున ఉన్న ఆయిల్‌తో అసలు ముప్పు.. పెట్రోల్ కంటే 'ఫ్యూయల్ ఆయిల్' ధరకే రెక్కలు
పెట్రోల్ కంటే 'ఫ్యూయల్ ఆయిల్' ధరకే రెక్కలు

Fuel Oil Crisis : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా.. సామాన్యులమైన మన ఆలోచనలు కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరుగుతాయి? అనే దగ్గరే ఆగిపోతాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 105 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇరాన్ యుద్ధం జరుగుతున్నా ఈ ధర మరీ అంత ప్రమాదకరంగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ, అసలు ముప్పు పెట్రోల్, డీజిల్ రూపంలో లేదు.. రిఫైనరీలో అట్టడుగున మిగిలిపోయే ఫ్యూయల్ ఆయిల్ రూపంలో పొంచి ఉంది. వినడానికి ఇది చాలా చౌకైనది, పనికిరానిది అనిపించినా.. ఇప్పుడు ఇదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఆగిపోయేలా చేస్తోంది.
ముడి చమురు చెత్త ఇంత ముఖ్యం ఎందుకు?
ముడి చమురును శుద్ధి చేసినప్పుడు పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఖరీదైనవి తీసేయగా.. చివరగా రిఫైనరీ టవర్ అడుగున మిగిలిపోయే చిక్కటి ద్రవమే ఈ ఫ్యూయల్ ఆయిల్. దీనిని బాటమ్ ఆఫ్ ద బ్యారెల్ అని పిలుస్తారు. కానీ, ప్రపంచ దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి ఇదే ప్రాణాధారం. సముద్రాలపై ప్రయాణించే భారీ కంటైనర్ నౌకలు, వాణిజ్య నౌకలు ఈ ఇంధనంతోనే నడుస్తాయి. ప్రపంచ దిగ్గజ షిప్పింగ్ సంస్థ మార్స్క్ సిఈఓ హెచ్చరించినట్లుగా.. ఆసియాలోని ప్రధాన ఓడరేవుల్లో ఈ ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి. సింగపూర్, యూఏఈలోని ఫుజైరా వంటి కీలక బంకరింగ్ కేంద్రాల్లో ఇంధనం దొరకడమే గగనమైపోయింది.
తలకిందులైన లెక్కలు.. ఆకాశంలో ధరలు
సాధారణంగా ముడి చమురు ధరను బట్టే మిగిలిన ఉత్పత్తుల ధరలు ఉంటాయి. కానీ ఇరాన్ యుద్ధం ఆ లెక్కలను మార్చేసింది. బ్రెంట్ క్రూడ్ 105 డాలర్ల వద్ద ఉంటే, దాని నుంచి వచ్చే ఫ్యూయల్ ఆయిల్ దానికంటే తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సింగపూర్‌లో ఫ్యూయల్ ఆయిల్ ధర 140 డాలర్లకు చేరగా, ఫుజైరాలో ఏకంగా 160 డాలర్లకు పెరిగింది. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే ప్రత్యేక రకం ఇంధనం అయితే 175 డాలర్ల మార్కును దాటేసింది. ఇది 2008, 2022 నాటి రికార్డు ధరల కంటే చాలా ఎక్కువ. వ్యాపారులు ఫోన్లలో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ధరలు మారుస్తున్నారు.. నిర్ణయం తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
హోర్ముజ్ జలసంధి మూసివేతే అసలు శాపం
ఈ సంక్షోభానికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి మూతపడటం. ఇది కేవలం ముడి చమురుకే కాదు, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ రిఫైనరీల నుంచి వచ్చే ఫ్యూయల్ ఆయిల్‌కు కూడా ప్రధాన దారి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారమయ్యే ఫ్యూయల్ ఆయిల్‌లో 20 శాతం ఈ గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. గల్ఫ్ దేశాల ముడి చమురులో వ్యర్థాలు (అంటే ఫ్యూయల్ ఆయిల్) ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు సౌదీ చమురును శుద్ధి చేస్తే 50 శాతం వరకు ఈ ఫ్యూయల్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఆ దారి మూతపడటంతో ఆసియా దేశాలకు సరఫరా నిలిచిపోయింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు
నౌకలకు ఇంధనం అందకపోతే ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది. ఆహార పదార్థాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రతిదీ ఖరీదైనదిగా మారుతుంది. ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాల నుంచి నౌకల ద్వారా ఆసియాకు ఈ ఇంధనాన్ని చేరవేసే ప్రయత్నాలు జరుగుతున్నా.. అది ఏమాత్రం సరిపోవడం లేదు. హోర్ముజ్ జలసంధి గొడవ ఎంత త్వరగా సర్దుమణిగితే అంత మంచిది. లేదంటే, రిఫైనరీ అడుగున ఉండే ఈ నల్లటి నూనె ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చడం ఖాయం.

