ఇంధన ధరల అదుపునకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్

Fuel Relief: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్న వేళ, సామాన్యుడికి ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో సరఫరా నిలిచిపోతుందనే భయాల మధ్య పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇటు ప్రజలకు, అటు చమురు కంపెనీలకు భారీ ఉపశమనం లభించనుంది. ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ రెండింటిపై లీటరుకు రూ.10 చొప్పున పన్ను తగ్గించింది. ఈ తగ్గింపుతో పెట్రోల్‌పై పన్ను లీటరుకు సుమారు రూ.3కి పడిపోగా, డీజిల్‌పై పన్ను దాదాపు సున్నా స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో, భారతీయులపై ఆ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గినా, ప్రజల సంక్షేమమే ముఖ్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు.

ధరలు వెంటనే తగ్గుతాయా?

పన్ను తగ్గించగానే పెట్రోల్ బంకుల్లో ధరలు వెంటనే పది రూపాయలు తగ్గిపోతాయని అనుకోలేం. ఎందుకంటే, గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, భారత్‌లో చమురు కంపెనీలు ధరలను పెంచకుండా నష్టాలను భరించాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.24, డీజిల్‌పై రూ.30 చొప్పున కంపెనీలు నష్టపోతున్నాయి. కాబట్టి, ఈ పన్ను కోత వల్ల వచ్చే లాభం ముందుగా కంపెనీల నష్టాలను పూడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాతే సామాన్యులకు ధరల తగ్గింపు ప్రయోజనం అందుతుంది.

మీరు కొనే లీటర్ పెట్రోల్ ధర వెనుక ఇంత కథ ఉందా?

పెట్రోల్ ధర ఎలా లెక్కకడతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత్ తన అవసరాల్లో 85 శాతం ముడి చమురును విదేశాల నుండి కొంటుంది.

ముడి చమురు ధర: ఒక బ్యారెల్ లెక్కన చూస్తే లీటరుకు రూ. 35-45 పడుతుంది.

రిఫైనింగ్ & రవాణా: ముడి చమురును శుద్ధి చేయడానికి, ఇన్సూరెన్స్, రవాణాకు మరో రూ.3-5 ఖర్చవుతుంది.

కంపెనీల మార్జిన్: చమురు కంపెనీలు తమ లాభం కోసం రూ.2-3 వేసుకుంటాయి.

కేంద్ర పన్ను : కేంద్రం వేసే పన్ను సుమారు రూ.19-20 ఉండేది (ఇప్పుడు తగ్గించారు).

డీలర్ కమిషన్: పెట్రోల్ బంక్ యజమానికి రూ.3-4 వెళ్తుంది.

రాష్ట్ర పన్ను (VAT): దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వ్యాట్ వేస్తాయి. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా (20% నుంచి 30%) ఉంటుంది.

అన్ని కలిపితేనే మనం బంకులో చెల్లించే వంద రూపాయల ధర వస్తుంది. అంటే మనం కట్టే ధరలో దాదాపు 40-55 శాతం కేవలం పన్నులే!

ప్రభుత్వ ఆదాయంపై దెబ్బ.. ప్రజలకు మేలు

ఈ నిర్ణయం వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే దేశానికి ఆదాయం తెచ్చే ప్రధాన వనరులలో ఇంధన పన్నులు ఒకటి. అయితే, ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలన్నా, రవాణా ఖర్చులు అదుపులో ఉండాలన్నా ఇది తప్పనిసరి. రాబోయే రోజుల్లో చమురు కంపెనీలు తమ ఆర్థిక స్థితిని చక్కదిద్దుకున్నాక, బంకుల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story