పిల్లల టికెట్లలో రాయితీ ఉందా? లేక పూర్తి ధర కట్టాలా?

IRCTC Child Ticket Rules : సామాన్య ప్రజలు దూర ప్రయాణానికి ఎక్కువగా ఆధారపడే రవాణా మార్గం రైళ్లు. భారతీయ రైల్వేస్ దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి రైలు బెస్ట్ ఆప్షన్. పిల్లల టికెట్ ధరలలో రాయితీలు, మినహాయింపులు ఉన్నప్పటికీ వాటికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. పిల్లలతో రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చని అనుకునే ముందు, భారతీయ రైల్వేస్ పిల్లల టికెట్ పాలసీ గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

భారతీయ రైల్వేస్ టికెట్ నియమాల ప్రకారం..పిల్లల వయస్సు ఆధారంగా టికెట్ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. ఐదేళ్ల లోపు పిల్లలు, వీరికి టికెట్ కొనుగోలు చేయాల్సిన కంపల్సరీ లేదు, ప్రయాణం ఉచితం. అయితే ఉచితంగా ప్రయాణించడానికి ప్రత్యేక సీటు లేదా బెర్త్ లభించదు. వీరు తమతో పాటు ఉన్న పెద్దవారితోనే సీటును పంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్న పిల్లలకు కూడా ప్రత్యేక బెర్త్ కావాలంటే, తప్పనిసరిగా పూర్తి టికెట్ ధర చెల్లించి కొనుగోలు చేయాలి.

5 నుంచి 12 ఏళ్ల పిల్లల విషయానికి వస్తే.. ఈ వయస్సులోని పిల్లలకు అర్థం ధర టికెట్‌‎కు ప్రయాణించే అవకాశం ఉంది. అర్థం ధర టికెట్ కొనుగోలు చేసినప్పటికీ వీరికి ప్రత్యేక సీటు లేదా బెర్త్ ఇవ్వబడదు. వీరికి కూడా ప్రయాణంలో విడిగా సీటు కావాలంటే తప్పనిసరిగా పూర్తి ధర చెల్లించి టికెట్ తీసుకోవాలి. కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణం చేసేటప్పుడు, సౌకర్యవంతంగా ప్రయాణించాలనుకుంటే, పిల్లల వయస్సు 5 ఏళ్లు దాటినా దాటకపోయినా పూర్తి ధర చెల్లించి టికెట్ కొనుగోలు చేయడం ఉత్తమం. ముఖ్యంగా మీ ప్రయాణం చాలా దూరం ఉన్నట్లయితే, పిల్లలకు విడిగా బెర్త్ ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. నడవలేని చాలా చిన్న పిల్లలు పెద్దల సంరక్షణలో ఉంటారు కాబట్టి వారికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పిల్లలకు ప్రయాణంలో విడిగా పడుకోవడానికి లేదా కూర్చోవడానికి ప్రత్యేక సీటు అవసరమని భావించినప్పుడు మాత్రమే తప్పనిసరిగా పూర్తి ధర చెల్లించి టికెట్ కొనుగోలు చేయండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story