Gautam Adani Birthday Special: ఒకప్పుడు రూ.100జీతానికి పని చేశాడు.. నేడు రూ.5.45లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి
నేడు రూ.5.45లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి

Gautam Adani Birthday Special:మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఆయన జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఒకానొకప్పుడు ఒక చిన్న దుకాణంలో పనిచేసిన ఆయన నేడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరిగా నిలిచారు. ఆయన పుట్టినరోజు (జూన్ 24)న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలా కష్టపడి, తెలివైన ఆలోచనలతో రూ.5.45 లక్షల కోట్ల భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో తెలుసుకుందాం.
ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీకి ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన భార్య ప్రీతి అదానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ అదానీ 1962లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టారు. ఆయన కుటుంబం మొదట బనాస్కాంతలోని థరాడ్ అనే ఊరి నుంచి వచ్చింది. ఆయన కుటుంబానికి మొదట్లో ఒక చిన్న బట్టల వ్యాపారం ఉండేది. గౌతమ్ అదానీ అహ్మదాబాద్‌లోనే చదువుకున్నారు. కానీ కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
ఆయన తన కెరీర్‌ను ముంబైలో కేవలం రూ.100 జీతానికి ఒక డైమండ్ షాపులో పనిచేయడం ద్వారా మొదలుపెట్టారు. అక్కడ ఆయన వజ్రాలను ఎలా పరీక్షించాలో, వాటిలోని మెళకువలను నేర్చుకున్నారు. త్వరలోనే వజ్రాల వ్యాపారంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత సొంతంగా ఒక చిన్న డైమండ్ బ్రోకింగ్ బిజినెస్ కూడా ప్రారంభించారు.
1988లో గౌతమ్ అదానీ అదానీ ఎంటర్ప్రైజెస్ ను ప్రారంభించారు. ఇదే నేడు అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ. మొదట్లో ఈ కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనానికి సంబంధించిన వస్తువులను దిగుమతి, ఎగుమతి చేసేది. కానీ త్వరలోనే గౌతమ్ అదానీ తన వ్యాపారాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, పోర్ట్స్, మైనింగ్, డేటా సెంటర్స్, ఎయిర్‌పోర్ట్స్, డిఫెన్స్ వంటి అనేక రంగాలకు విస్తరించారు.
ఈరోజు అదానీ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గౌతమ్ అదానీ సంపదలో కొన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినా, ఆయన వ్యాపార సామ్రాజ్యం మాత్రం నిరంతరం బలపడుతూనే ఉంది. బ్లూమ్‌బర్గ్, ఫోర్బ్స్ ప్రకారం, గౌతమ్ అదానీ మొత్తం సంపద 80 బిలియన్ డాలర్లకు పైగా అంచనా.. ఇది భారత రూపాయిల్లో దాదాపు రూ.5.45 లక్షల కోట్లకు సమానం.
