జెమిని దెబ్బకు ఉద్యోగులు విలవిల

Gemini Crypto Layoffs : ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ జెమిని నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. క్రిప్టో మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీ భారీగా ఉద్యోగుల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను కుదించుకుంటూ, కేవలం లాభదాయకమైన ప్రాంతాలపైనే దృష్టి సారించాలని జెమిని నిర్ణయించింది. ఫేస్‌బుక్ వివాదంతో పాపులర్ అయిన వింక్లేవోస్ కవలలు స్థాపించిన ఈ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టెక్, క్రిప్టో వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

క్రిప్టో ఎక్స్ఛేంజ్ రంగంలో అగ్రగామిగా ఉన్న జెమిని, తన మొత్తం సిబ్బందిలో సుమారు నాలుగో వంతు మందిని, అంటే 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆపరేషనల్ ఫోకస్‌ను పెంచడమే ఈ లేఆఫ్స్ ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ఈ ఉద్యోగాల కోత ప్రభావం అమెరికా, సింగపూర్, యూరప్ ప్రాంతాల్లోని ఉద్యోగులపై పడనుంది. 2026 ప్రథమార్థం నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఉద్యోగులను తీసేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మార్కెట్లను కూడా జెమిని వదిలేస్తోంది.

యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి కీలక మార్కెట్ల నుంచి తన కార్యకలాపాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని జెమిని నిర్ణయించింది. దశలవారీగా ఈ దేశాల్లో తన సేవలను నిలిపివేసి, ఇకపై కేవలం అమెరికా, సింగపూర్ మార్కెట్లపైనే దృష్టి పెట్టనుంది. పరిమిత మార్కెట్లలో ఉండటం వల్ల వనరులను సమర్థవంతంగా వాడుకోవచ్చని, స్థిరమైన వృద్ధిని సాధించవచ్చని సంస్థ భావిస్తోంది. క్రిప్టో పరిశ్రమలో మారుతున్న నిబంధనలు మరియు మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా కనిపిస్తున్నాయి.

ఈ భారీ పునర్వ్యవస్థీకరణ కోసం జెమిని సుమారు 11 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.90 కోట్లు) వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తోంది. ఇందులో ఉద్యోగులకు ఇచ్చే సెవెరెన్స్ పే, నోటీసు పీరియడ్ పేమెంట్స్, ఆఫీసుల ఎగ్జిట్ కాస్ట్, కాంట్రాక్టుల రద్దు ఫీజులు ఉన్నాయి. ఈ ఖర్చులన్నీ 2026 మొదటి త్రైమాసికంలోనే నమోదు కానున్నాయి. ఒకప్పుడు బిట్‌కాయిన్ పెట్టుబడులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వింక్లేవోస్ బ్రదర్స్, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సంస్థను కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story