Gen Z: భారత వినియోగదారుల మార్కెట్‌లో సరికొత్త శకం మొదలైంది. దేశంలోని జెన్ జెడ్(1997-2012 మధ్య జన్మించినవారు) ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇంజిన్‌గా మారారు. వీరు ప్రతి ఏటా ఏకంగా 860 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అందులో 660 బిలియన్ డాలర్లు తల్లిదండ్రుల నుంచి వచ్చిన డబ్బే కావడ విశేషం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో సుమారు 37.7 కోట్ల మంది జెన్ జెడ్ యువత ఉన్నారు. వీరి జనాభా ఏకంగా అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ తరంలో కేవలం నాలుగో వంతు మంది మాత్రమే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేస్తున్నారు. సంపాదన లేకపోయినా బ్రాండ్లు, యాప్‌ల ఎంపిక మాత్రం వీరిదే అవుతోంది. బిల్లు చెల్లింపులు మాత్రం తల్లిదండ్రుల జేబుల నుంచి సాగుతున్నాయి. 2035 నాటికి ఈ తరం ఖర్చు 2 ట్రిలియన్ డాలర్లకు చేరి దేశ మొత్తం వినియోగంలో సగానికి పైగా ఆక్రమించనుంది.

లైఫ్‌స్టైల్, షేర్ మార్కెట్ రంగాల్లో హవా

ఈ యువత ఆలోచనా ధోరణి పాత జనరేషన్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. ఆహార పదార్ధాల కంటే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బూట్లు, బయట తినే తిండి, టూర్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. ఇలా ప్రతి దాంట్లోనూ వీరి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కోటక్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం షేర్ మార్కెట్లో కొత్తగా చేరుతున్న ఇన్వెస్టర్లలో 59 శాతం మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడం విశేషం. సొంతంగా రీసెర్చ్ చేస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ మ్యూచువల్ ఫండ్లలోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

లగ్జరీ కార్లు, సింపుల్ జ్యువెలరీకి ప్రాధాన్యం

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు లగ్జరీ కార్లను కొనేవారిలో సీనియర్ డాక్టర్లు, బడా వ్యాపారవేత్తలతో పాటు యువ టెక్ పారిశ్రామికవేత్తలు భారీగా పెరుగుతున్నారు. ఆభరణాల విషయానికొస్తే పాతకాలపు భారీ డిజైన్లకు స్వస్తి చెప్పి రోజువారీ వాడకానికి అనువైన తేలికపాటి జ్యువెలరీకి ప్రాధాన్యమిస్తున్నారు. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లోనూ కేవలం బ్రాండ్ పేరు చూడకుండా అందులోని పదార్థాలు, రసాయనాల ప్రభావంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొనుగోలు చేస్తున్నారు.

పొదుపు పక్కన పెట్టి అప్పులకు జై

భారతీయ పాత తరం ముందుగా పొదుపు చేసి ఆ తర్వాత రుణాల వైపు అడుగులు వేసేది. జెన్ జెడ్ మాత్రం తమ ఆర్థిక ప్రయాణాన్ని రుణాలు తీసుకోవడంతోనే ప్రారంభిస్తోంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం 2024 లో మొదటిసారి రుణాలు తీసుకున్న వారిలో 41 శాతం మంది ఈ యువతరం వారే. యూపీఐ, బై నౌ పే లేటర్ లాంటి సదుపాయాలు ఖర్చు చేయడాన్ని చాలా సులభతరం చేశాయి. వయసు చిన్నగా ఉన్నప్పుడే అపరిమితంగా క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల భవిష్యత్తులో క్రెడిట్ హిస్టరీ దెబ్బతినే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story