Gold : లాకర్లలో ఉండే బంగారం అమ్మేస్తున్నారు.. యువతలో మారుతున్న సరికొత్త గోల్డ్ ట్రెండ్
సరికొత్త గోల్డ్ ట్రెండ్

Gold : భారతీయ సమాజంలో తరతరాలుగా బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాతన కాలం నుంచి పసిడిని కేవలం ఒక సంపదగా మాత్రమే కాకుండా, కుటుంబ సెంటిమెంట్‌గా, భావోద్వేగంగా చూసేవారు. పెద్దలు ఇచ్చిన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో దాచి ఉంచడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే, మారుతున్న కాలంతో పాటు సరికొత్త తరం (Gen Z, మిలీనియల్స్) ఆలోచనల్లో కూడా పెను మార్పులు వస్తున్నాయి. నేటి యువత బంగారాన్ని కేవలం లాకర్లలో దాచుకునే వస్తువుగా కాకుండా, ఒక పవర్‌ఫుల్ పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. తమ జీవితంలోని పెద్ద పెద్ద లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వారసత్వంగా వచ్చిన పాత జ్యువెలరీని విక్రయించడానికి కూడా వెనకాడటం లేదు.
సెంటిమెంట్ కంటే లైఫ్ గోల్స్ ముఖ్యం
ఈ సరికొత్త ట్రెండ్‌కు ఉదాహరణగా ముంబైకి చెందిన ఒక యువ జంట కథనాన్ని చెప్పుకోవచ్చు. చాలా ఏళ్లుగా బ్యాంక్ లాకర్‌కే పరిమితమైన పాత తరం నాటి భారీ గాజులు, పెళ్లి హారాలను అమ్మేసి, ఆ వచ్చిన రూ.20 లక్షలతో నవీ ముంబైలో ఒక కొత్త ఇంటి కోసం డౌన్ పేమెంట్ చేశారు. దీనివల్ల వారి నెలవారీ హోమ్ లోన్ ఈఎంఐ ఏకంగా రూ.20,000 వరకు తగ్గిపోయింది. మిగిలిన డబ్బుతో జీవితాన్ని మరింత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేటి యువతకు పాత సెంటిమెంట్ల కంటే జీవితంలో త్వరగా సెటిల్ అవ్వడం, సొంతింటి కల నెరవేర్చుకోవడం వంటి లైఫ్ గోల్స్ చాలా ముఖ్యమని ముత్తూట్ ఎక్సిమ్ సీఈఓ కేయూర్ షా విశ్లేషించారు.
ఆభరణాల కంటే కాయిన్స్, బిస్కెట్లపైనే మోజు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాత బంగారాన్ని అమ్మి లేదా కొత్త డిజైన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పాప్లీ గ్రూప్ నివేదిక ప్రకారం.. జ్యువెలరీ స్టోర్లకు వచ్చే కస్టమర్లలో దాదాపు 70 నుంచి 75 శాతం మంది పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంలోని ఇళ్లు, బ్యాంక్ లాకర్లలో సుమారు 1 లక్ష టన్నుల కంటే ఎక్కువ బంగారం వృధాగా పడి ఉందని అంచనా. కాగా ఐక్రా నివేదిక ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2025-26లో బంగారు ఆభరణాల డిమాండ్ 21% తగ్గింది. కానీ ఇదే సమయంలో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య 22% పెరగడం విశేషం. దీనిని బట్టి యువత ఆభరణాల కంటే ప్యూర్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
చదువులు, బిజినెస్ కోసం పసిడి విక్రయాలు
ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఆ రికార్డు ధరలను యువత తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన ఒక యువతి తనకు వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించి, ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి మంచి లాభాలను ఆర్జిస్తోంది. అలాగే మరో కుటుంబం తమ లాకర్‌లో ఉన్న బంగారాన్ని అమ్మి రూ.80 లక్షల రూపాయలను సమకూర్చుకుంది. ఆ డబ్బుతో కొడుకును అమెరికాలో హయ్యర్ స్టడీస్ కోసం పంపించడమే కాకుండా, తండ్రి కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ప్రారంభించడానికి ఆసరాగా నిలిచింది. చదువు, వ్యాపారాల కంటే ముఖ్యమైన లైఫ్ గోల్స్ ఏవీ ఉండవని, అలాంటి అత్యవసర సమయాల్లోనే బంగారం ఉపయోగపడాలని వారు భావిస్తున్నారు.
తనిష్క్ స్టోర్లలో కిలోల కొద్దీ గోల్డ్ ఎక్స్ఛేంజ్
ఈ మారుతున్న ట్రెండ్ వల్ల కార్పొరేట్ జ్యువెలరీ బ్రాండ్లకు కూడా భారీగా లాభాలు సమకూరుతున్నాయి. గడిచిన తొమ్మిది నెలల్లోనే టైటాన్ సంస్థకు చెందిన తనిష్క్ స్టోర్లలో సుమారు 5 లక్షల మంది కస్టమర్లు ఏకంగా 11,000 కిలోల కంటే ఎక్కువ పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. ఇది దేశీయంగా గోల్డ్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడమే కాకుండా, ఇతర దేశాల నుంచి భారత్ చేసే బంగారం దిగుమతుల భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నేటి ఆధునిక మహిళలు దశాబ్దాల నాటి పాత, బరువైన డిజైన్లను ధరించడానికి ఇష్టపడటం లేదు. అందుకే వాటిని ఇచ్చేసి రోజువారీ ఆఫీస్ అవసరాలకు తగినట్లుగా ఉండే లైట్ వెయిట్ ఆభరణాలు లేదా గోల్డ్ ఈటీఎఫ్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. సాంప్రదాయ వేడుకల్లో బంగారానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం పసిడిని ఒక స్మార్ట్ అసెట్‌గా వాడుకోవడంలో కొత్త తరం దూసుకుపోతోంది.

