Digital Gold : భారతదేశంలో బంగారం కొనడం అంటే సాంప్రదాయకంగా పెళ్లిళ్లు, పండుగలు లేదా ఇంట్లోని పెద్దల దాచుకునే పొదుపు మార్గంగా చూసేవారు. కానీ నేటి యువత, అంటే Gen Z(Gen Z - 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు) ఈ పాత ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేస్తున్నారు. ఇప్పటికే దేశీయ షేర్ మార్కెట్‌లో దాదాపు 40 శాతం వాటాను దక్కించుకున్న ఈ తరం, ఇప్పుడు పసిడి మార్కెట్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన స్వర్ణిమ్ ఉడాన్ 2047 నివేదిక ప్రకారం.. యువత డిజిటల్ ఆలోచనా విధానం భారత్‌లోని రూ. 315 లక్షల కోట్ల భారీ గోల్డ్ మార్కెట్‌లో పెట్టుబడుల విప్లవాన్ని తీసుకురాబోతోంది.

ఇళ్లలో పడి ఉన్న 31,000 టన్నుల బంగారం బయటకు

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద ప్రస్తుతం దాదాపు 31,000 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీని మార్కెట్ విలువ అక్షరాలా రూ. 314.9 లక్షల కోట్లు (3.4 ట్రిలియన్ డాలర్లు). దేశంలోనే అత్యంత భారీగా ఉపయోగపడకుండా పడి ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్‌లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. Gen Z యువత పసిడిని కేవలం ఆభరణాలుగా కాకుండా ఒక ఫ్లెక్సిబుల్ ఫైనాన్షియల్ అసెట్‌గా భావిస్తున్నారు. ఇళ్లలో బీరువాలకే పరిమితమైన ఈ బంగారంలో కొంత భాగాన్ని అయినా ఫైనాన్షియల్ మార్కెట్‌లోకి తీసుకురాగలిగితే, దేశంలో లిక్విడిటీ పెరగడమే కాకుండా పసిడి దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.

డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్‌ల వైపే మొగ్గు

గత తరాలతో పోలిస్తే నేటి యువత బంగారం విషయంలో సౌకర్యం, లిక్విడిటీ, పారదర్శకతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భౌతికంగా బంగారు నగలు కొని దాచుకోవడం కంటే డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఇటిఎఫ్, గోల్డ్ ఎస్ఐపి వంటి మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2035 నాటికి ఈ Gen Z తరం వినియోగదారుల ఖర్చు దాదాపు 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆఫ్‌లైన్ లేదా డిజిటల్ మోడ్‌లో కొనుగోలు చేసే విధానం వల్ల జువెలరీ షాపుల కంటే స్మార్ట్‌ఫోన్‌ల నుంచే గోల్డ్ బిజినెస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

పరిశ్రమలో మార్పులు.. నేషనల్ గోల్డ్ బోర్డు ఏర్పాటు

రూ. 4.5 లక్షల కోట్ల విలువైన భారతీయ గోల్డ్ జువెలరీ మార్కెట్ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. యంగ్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి జువెలర్లు కేవలం డిజైన్లకే పరిమితం కాకుండా కస్టమైజేషన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై దృష్టి పెట్టాలని నివేదిక సూచిస్తోంది. డబ్ల్యూజీసీ ఇండియా రీజినల్ సిఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ.. దేశంలో పసిడి రంగ నియంత్రణ, విధానాల సమన్వయం కోసం నేషనల్ గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే రీసెర్చ్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం గోల్డ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పడం ద్వారా బంగారం వ్యాపారాన్ని మరింత ఆధునికీకరించవచ్చని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story